అందని ఉపాధి వేతనాలు
- ఐదు వారాలుగా పెండింగ్
- పట్టించుకోని అధికారులు
ప్రజాశక్తి - కొత్తపల్లి
గ్రామాల్లో వలసలు నివారించడమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద వ్యవసాయ కూలీలకు పనులు కల్పిస్తున్నాయి. ఈ ఏడాది పలు గ్రామాల్లో పనులు కావాలని అడిగిన ప్రతి ఒక్కరికీ ఉపాధి సిబ్బంది పనులు కల్పించారు. పనులు చేసిన కూలీలకు ఐదు వారాలుగా వేతనాలు చెల్లించడం లేదు. బిల్లులు పడకపోవడంతో కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కొత్తపల్లి మండలంలో ఈ ఏడాది ఫిబ్రవరి నెల నుంచి పలు గ్రామాల్లో ఉపాధి పనులు కల్పించారు. మండలంలో సుమారు 4 వేల నుంచి 5 వేల మంది దాకా ఉపాధి కూలీలకు సుమారు 5 వారాల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. దాదాపు ఒక కోటి 48 లక్షల రూపాయలు కూలీలకు వేతనాలు పడాల్సి ఉంది. ఉపాధి కూలీలు బిల్లులు ఎప్పుడు పడతాయోనని ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. ఒక వైపు ప్రభుత్వం మాత్రం ఆర్భాటంగా ఉన్న గ్రామాల్లోనే అడిగిన ప్రతి కూలికి ఉపాధి పనులు కల్పించి వలసలు నివారించడంతోపాటు బిల్లులు కూడా వారం వారం పడతాయని చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం బిల్లులు పడడం లేదు. పనులు ప్రారంభమైన కొన్ని రోజుల వరకు పనులు చేసిన వెంటనే వారం వారం బిల్లులు పడ్డాయి. ఆ తర్వాత సుమారు 5 వారాల నుంచి బిల్లులు పడకపోవడంతో బిల్లుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పెండింగ్ ఉపాధి బిల్లులు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కూలీలు కోరుతున్నారు.
బిల్లులు చెల్లించి కూలీలను ఆదుకోవాలి
స్వాములు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి.
గ్రామాల్లో ఉపాధి కూలీలకు ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించి ఆదుకోవాలి. కొత్తపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఉపాధి కూలీలకు బిల్లులు రాక ఇబ్బందులకు గురవుతున్నారు. బిల్లుల చెల్లింపు ఆలస్యమైతే కూలీలతో కలిసి ఆందోళనలు చేపట్టాల్సి వస్తుంది. ప్రస్తుత ప్రభుత్వ నిబంధనలు కూలీలకు శాపంగా మారాయి. కుటుంబానికి వందరోజుల పని కాకుండా 200 రోజులు పని దినాలు కల్పించాలి.










