ప్రజాశక్తి - హోళగుంద
ప్రధానమంత్రి గ్రామీణ యోజన పథకం కింద ముంజూరైన ఇళ్ల నిర్మాణాలు పూర్తవుతున్నా సకాలంలో బిల్లులు అందకపోవడంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. మండలంలోని సులువాయి గ్రామానికి చెందిన వన్నూరప్ప, సేకప్ప, చిదానంద, నాగప్పలు మంగళవారం ఎంపిడిఒ కార్యాలయం ముందు విలేకరులతో మాట్లాడారు. ప్రధానమంత్రి గ్రామీణ యోజన పథకం కింద గతేడాది ఏప్రిల్‌లో ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. కేవలం కొందరికి రూ.70 వేలు, మరికొందరికి రూ.35 వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని వాపోయారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తవుతున్నా హౌసింగ్ అధికారులు బిల్లులు సకాలంలో చెల్లించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం నిర్ణయించిన ఇంటి విలువ రూ.1.80 లక్షలు ఉన్నప్పటికీ ఇంతవరకు మిగిలిన బిల్లులు చెల్లించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. వెంటనే బిల్లులు మంజూరు చేస్తామని చెప్పి ఇప్పుడు మాట మారుస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం నిధుల కొరత ఉందని హౌసింగ్ అధికారులు ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. సిమెంటు, ఇనుము అప్పులు చేసి కొనుగోలు చేశామని తెలిపారు. ఇంకా మేస్త్రీలకు, కూలీలకు డబ్బులు ఇవ్వాల్సి ఉందన్నారు. హౌసింగ్ అధికారులు స్పందించి బిల్లులు ముంజూరు చేయాలని కోరారు. లేకపోతే హౌసింగ్ కార్యాలయం ముందు ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
మాట్లాడుతున్న లబ్ధిదారులు










