ప్రజాశక్తి - మార్కాపురంరూరల్ : పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని మార్కాపురం పట్టణ, గ్రామీణ ఎస్‌ఐలు పి. కోటేశ్వరరావు ఎం. వెంకటేశ్వర్ నాయక్ తెలిపారు. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా పోలీస్ సిబ్బంది, ఎన్‌సిసి విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు సిబ్బందిని స్మరిస్తూ ప్రతి ఏడాది అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టూటౌన్ ఎస్‌ఐ పి. సువర్ణ, ట్రాఫిక్ ఎస్‌ఐ కష్ణయ్య, ఎఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుల్లు, పోలీస్ సిబ్బంది, ఎన్‌సిసి విద్యార్థులు పాల్గొన్నారు. యర్రగొండపాలెం : పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని యర్రగొండపాలెం ఎస్‌ఐ కోటయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ అమరవీరుల చిత్రపటానికి పుష్పగుచ్చాలతో నివాళులర్పించారు. అనంతరం ఎస్‌ఐ కోటయ్య మాట్లాడుతూ ప్రజల రక్షణ కోసం పోలీసులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయక విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. తీవ్రవాదం, ఉగ్రవాదం, అసాంఘిక శక్తులతో జరిగిన పోరాటాల్లో అనేకమంది పోలీసులు ప్రాణాలను కోల్పోయారని పేర్కొన్నారు. అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. దర్శి : విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు మరువలేనివని సిఐ రామకోటయ్య తెలిపారు. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా పోలీసు స్టేషన్ వద్ద నుంచి గడియార స్తంభం సెంటర్ వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ విధి నిర్వహణలో అమరులైన పోలీసు సిబ్బంది త్యాగాలు వెలకట్టలేనివని తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శి, తాళ్లూరు, ముండ్లమూరు ఎస్‌ఐలు రామకృష్ణ, వైవి. రమణయ్య, కృష్ణయ్య, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కనిగిరి : పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద నుంచి పామూరు బస్టాండ్ వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్‌ఛార్జి ఎస్‌ఐ మాధవరావు మాట్లాడుతూ దేశం కోసం ఎంతో మంది జవాన్లు తమ ప్రాణాలను అర్పించారన్నారు. ప్రజా రక్షణ కోసం ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగనిరతిని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21 పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా పాటిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పుర ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, సచివాలయ మహిళా పోలీసులు, పోలీస్ సిబ్బంది, గుడ్ హెల్ఫ్ ఫౌండేషన్ డైరెక్టర్ మండ్రు రమేష్ బాబు,కరాటే మాస్టారు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.










