Sep 11,2023 21:58

అమరులకు నివాళ్లు అర్పిస్తున్న డిఎఫ్‌ఒ ప్రసూన, సిబ్బంది

ప్రజాశక్తి- పార్వతీపురంరూరల్‌ : ప్రభుత్వానికి చెందిన అటవీ సంపద పరిరక్షణలో తమ ప్రాణాలను కోల్పోయిన అమరుల త్యాగాలు మరువలేనివని జిల్లా అటవీ శాఖ అధికారిని జిఎపి ప్రసూన అన్నారు. అటవీ శాఖ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సోమవారం తన కార్యాలయంలో సిబ్బందితో కలిసి వారి చిత్రపటాలకు ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ దాదాపు వందేళ్లుగా అటవీ శాఖకు చెందిన సిబ్బంది రాత్రి పగలు అనకా కష్టపడుతూ అటు వన్యప్రాణుల సంరక్షణలోనూ అటవీ శాఖకు చెందిన విలువైన సంపదను పరిరక్షించడంలోనూ ఎనలేని ధైర్య సాహసాలు ప్రదర్శించి తమ ప్రాణాలను పణంగా పెట్టారని అన్నారు. వారి సేవలను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏటా సెప్టెంబరు 11న సంస్మరణ దినోత్సవము జరుపుకుని వారి త్యాగాలను గుర్తు చేసుకోవడం ప్రతి ఒక్క అటవీ శాఖ సిబ్బంది కర్తవ్యమని అన్నారు. అనంతరం పార్వతీపురం పాలకొండ ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారులు పి.త్రినాధ, పివి శాస్త్రిలు సంస్మరణ దినోత్సవ ప్రాధాన్యతను వివరించారు. కార్యక్రమంలో సెక్షన్‌ అధికారులు ఎం.సోమశేఖర్‌, ఎం.మనోజ్‌కుమార్‌, ఎస్‌.గౌరీ శంకర రాజు సిబ్బంది పాల్గొన్నారు.
సాలూరు: జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా స్థానిక అటవీ రేంజ్‌ అధికారి కార్యాలయంలో రేంజ్‌ అధికారి కె.రామారావు ఆధ్వర్యాన సిబ్బంది నివాళులర్పించారు. ఈ సందర్భంగా అమరవీరుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అటవీ ఉద్యోగుల సేవలు మరువలేనివని రేంజ్‌ అధికారి రామారావు అన్నారు. కార్యక్రమంలో అటవీ సెక్షన్‌ అధికారులు, గార్డులు పాల్గొన్నారు.