Aug 28,2023 22:55

ప్రజాశక్తి-గన్నవరం: విద్యుత్‌ భారాలను ప్రజలపై మోపుతున్న ప్రధాని నరేంద్రమోదీ, సీఎం జగన్‌ను గద్దె దించాల్సిన అవసరం ఆసన్నమైందని సీపీయం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కళ్లం వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో విద్యుత్‌ అమరవీరుల సంస్మరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మోడీ గద్దె నెక్కిన నాటి నుంచి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు అతి తక్కువ ధరలకు దోచిపెడుతున్నారని విమర్శించారు. ఘన చరిత్ర గల విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించే ఆలోచన దుర్మార్గపు చర్యగా పేర్కొన్నారు. మండల కార్యదర్శి మల్లంపల్లి ఆంజనేయులు మాట్లాడుతూ నేడు రాష్ట్రంలో కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్రాన్ని ఆర్ధికంగా దివాలా తీయించి అప్పుల పాలు చేసిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు డబ్బులు లేవని, రాష్ట్రంలో అభివద్ధి కుంటుపడిందని, ఉద్యోగాలు భర్తీ చేయలేదని, ప్రాజెక్టుల నిర్మాణాలు లేక నిరుద్యోగులు ఇతర రాష్ట్రాలకు వలస పోతున్నారన్నారు. అమరుల ఆశయాల సాధనకు పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అనుమోలు వెంకటేశ్వరరావు, కె రాంబాబు, ఏసుదాసు, జయమ్మ, మీరా ఖాన్‌, మరియదాసు, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. పెనమలూరు : విద్యుత్‌ ఉద్యమంలో మృతిచెందిన అమరవీరులకు తాడిగడప మున్సిపాలిటీ కార్మికనగర్‌ పోరంకి సిఐటియు కార్యాలయంలో సోమవారం నివాళులర్పించారు. సీనియర్‌ నాయకులు నారిన వెంకట్రావు అమరవీరుల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సిపిఎం పెనమలూరు మండల కార్యదర్శి ఉప్పాడ ట త్రిమూర్తులు మాట్లాడుతూ విద్యుత్‌ భారాలపై ప్రజలు తిరగబడ్డాలన్నారు. పెంచిన విద్యుత్‌ భారాలను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మస్తాన్‌వలి, పాతాళలక్ష్మి, పుసులూరి సత్యనారాయణ, సిహెచ్‌ భవానీ, విసం రవణమ్మ, వై.సరళ, ఉప్పాడ ఈశ్వరి, దమ్మాటి లక్ష్మి, విసం సోమశేఖర్‌, కృష్ణ, దమ్మాటి గోపి, శశిరేఖ పాల్గొన్నారు.