Jun 23,2023 21:10

అధికారుల కోసం వేచి ఉన్న చెంచులు

అమ్మఒడి 'వేలిముద్ర' కష్టాలు..
- సచివాలయంలోనే వేయాలని హుకూం
- 12 గంటల తర్వాత వచ్చిన ఎర్రమఠం సచివాలయ అధికారులు
- చంటి పిల్లలతో ఇబ్బందులు పడిన గిరిజన విద్యార్థుల తల్లులు

ప్రజాశక్తి - కొత్తపల్లి
     వైసిపి ప్రభుత్వం నవరత్నాల పేరుతో అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు వేలిముద్రలు వేయించుకుంటుంది. వేలిముద్రలను సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ఇంటి వద్దకే వచ్చి తీసుకోవాల్సి ఉంది. అయితే కొత్తపల్లి మండలంలోని ఎర్రమఠం సచివాలయ పరిధిలోని గ్రామాల్లోని విద్యార్థుల తల్లులు అమ్మ ఒడి పథకం కోసం సచివాలయం వద్దకే వచ్చి వేలిముద్ర వేయాలని వాలంటీర్లు, సిబ్బంది చెప్పారు. దీంతో వేలిముద్ర వేసేందుకు గిరిజన గ్రామాల విద్యార్థుల తల్లులు శుక్రవారం అష్టకష్టాలు పడ్డారు. అధికారులు మధ్యాహ్నం 12 గంటల తర్వాత రావడంతో ఎంతో కష్టపడి వచ్చిన తల్లులు వారి కోసం గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కొత్తపల్లి మండలం అధికారులకు దూరంగా నల్లమల అడవులకు సమీపంలో ఉంది. నల్లమల అడవులకు అతి సమీపంలో సిద్దేశ్వరం, జానాల గూడెం, బలపాల తిప్ప గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో చెంచులు, ఎస్సీలు ఎక్కువ మంది ఉన్నారు. ఎర్రమఠం గ్రామ సచివాలయం పరిధిలో పాత మాడుగుల, కపిలేశ్వరం, జానాల గూడెం, బలపాలతిప్ప, సిద్దేశ్వరం గ్రామాలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న పేద విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఆర్థిక చేయూతగా అమ్మ ఒడి కార్యక్రమాన్ని వైసిపి ప్రభుత్వం గత నాలుగేళ్లుగా అమలు చేస్తుంది. ఈ పథకం నగదు మొత్తం తల్లుల బ్యాంకు ఖాతాలో జమ కావాలంటే బయోమెట్రిక్‌ అథటికేషన్‌ చేయాల్సి ఉంది. ఇందుకు సచివాలయ సిబ్బంది, వాలంటీర్‌ విద్యార్థుల తల్లుల వద్దకు వెళ్లి బయోమెట్రిక్‌ అథటికేషన్‌ చేయించాలి. కానీ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తల్లులే సచివాలయానికి వచ్చి బయోమెట్రిక్‌ వేయించుకోవాలని సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు చెప్పారు. ఈ గ్రామాల ప్రజలకు సచివాలయానికి వచ్చేందుకు ఎటువంటి బస్సు సౌకర్యం లేదు. అమ్మ ఒడి కోసం వేలిముద్ర వేసేందుకు సుమారు 20 నుంచి 30 మంది దాకా గిరిజన విద్యార్థుల తల్లులు ఎర్రమఠం గ్రామంలో ఉన్న సచివాలయం వద్దకు శుక్రవారం వచ్చారు. అధికారులు మధ్యాహ్నం 12 గంటల తర్వాత రావడంతో చంటి పిల్లలతో వచ్చిన గిరిజన విద్యార్థుల తల్లులు తిండి తిప్పలు లేక పస్తులతో గంటల తరబడి నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంది. సుమారు 10 నుంచి 15 కిలోమీటర్ల దూరం ఆటోలో 50 రూపాయలు ఖర్చు పెట్టుకుని, రోజు వారి కూలి పోగొట్టుకొని అమ్మ ఒడి కోసం వేలిముద్ర వేసేందుకు వస్తే అధికారులు ఆలస్యంగా రావడంతో మహిళలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజల వద్దకే పాలన అంటూ ఎంతో ఆర్భాట ప్రచారాలు చేస్తున్నా ఆచరణలో మాత్రం శూన్యం. సచివాలయం అధికారులు, గ్రామ వాలంటీర్లు కలిసి ప్రజల వద్దకు వెళ్లి అర్హుల నుంచి వివరాలు సేకరించి, తంబు వేయించుకోవాలన్న ఆదేశాలు జిల్లా అధికారుల నుంచి ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రాబోవు రోజుల్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సిబ్బంది, వాలంటీర్లు గ్రామాలకే వెళ్లి వేలిముద్ర వేయించుకునేలా చూడాలని గిరిజన మహిళలు కోరుతున్నారు.