హైదరాబాద్: ప్రముఖ సంస్థ అమెజాన్‌లో తెలుగు యువకుడు గిర్రెడ్డి వివేక్‌కి బంఫర్ ఆఫర్ లభించింది. హైదరాబాద్‌లో ఉంటున్న వివేక్ అమెరికాలోని జార్జియా టెక్ విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం ఎంబిఎ చేస్తున్నారు. గత ఏడాది జరిగిన ప్రాంగణ నియమాకాల్లో కోటిన్నర వార్షిక వేతనంతో సీనియర్ ఫైనాన్షియల్ ఎనలిస్టుగా అమెజాన్‌లో ఎంపికయ్యారు. జూన్ 21న బాధ్యతలు చేపట్టనున్నారు.
వివేక్ తల్లిదండ్రులు భానురెడ్డి, జీఎస్ రెడ్డి హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో ఉంటున్నారు. వీరి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ. జీఎస్ రెడ్డి సెబీలో జనరల్ మేనేజర్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. ప్రస్తుతం ఎపి కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
వివేక్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, మెక్‌గిల్ యూనివర్సిటీలో వివేక్ బిఎ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్ చదివారు. ఆ తర్వాత బెంగళూరులో మూడేళ్లు ఉద్యోగం చేశారు. ఈ ఏడాది జూన్ 21న సియాటెల్‌లోని ఆ సంస్థ కేంద్ర కార్యాలయంలో చేరనున్నారు. ఎంబిఎ చేయాలన్న ఉద్దేశంతో జీమాట్ రాసి 94 పర్సంటైల్ సాధించారు. అంతకుముందు శాట్‌లో గణితం విభాగంలో 800కు 800 సాధించారు. పూర్తి ఉపకారవేతనం ద్వారా జార్జియా టెక్ విశ్వవిద్యాలయంలో రెండేళ్ల ఎంబిఎ(ఫైనాన్స్) కోర్సులో చేరారు. తొలి ఏడాది పూర్తయ్యాక అమెజాన్ కంపెనీలో 12 వారాల ఇంటర్న్‌షిప్ చేశారు. ఎంబిఎ చదివే ప్రతిభావంతులైన విద్యార్థుల వివరాలు ప్రచురించే అమెరికాలోని ప్రముఖ మేగజైన్ 'పొయట్స్ అండ్ క్వాంట్స్'లో గత ఏడాది వివేక్ వివరాలు ప్రచురితమయ్యాయి.










