Jun 24,2023 18:06

సమావేశంలో మాట్లాడుతున్న ఇఒ

ఆలయ ప్రతిష్టను కాపాడాలి : ఇఒ
ప్రజాశక్తి - మహానంది

     సుదూర ప్రాంతాల నుండి మహానంది క్షేత్రానికి వచ్చే భక్తులతో వ్యాపారస్తులు గౌరవ మర్యాదలతో మాట్లాడుతూ క్షేత్ర ప్రతిష్ట కాపాడాలని ఈవో చంద్రశేఖర్‌ రెడ్డి తెలిపారు. శనివారం మహానంది క్షేత్రంలో వ్యాపారస్తులతో ఆలయ చైర్మన్‌ మహేశ్వర్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఇఒ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ శుక్రవారం కొన్ని దుకాణాలు తనిఖీ చేయగా నిషేధిత సిగరెట్స్‌, గుట్కా, పాన్‌ మసాలాలు దొరికాయన్నారు. క్షేత్రంలో వ్యాపారం చేసుకుని జీవనం సాగించేవారు నిషేధిత వస్తువులైన సిగరెట్‌, బీడీ, గుట్కా, పొగాకు వస్తువులను విక్రయించరాదని, అలా విక్రయించిన వారి మీద కఠిన చర్యలు తీసుకుని లైసెన్స్‌ రద్దు చేసి జరిమానా విధిస్తామన్నారు. క్షేత్ర పరిధిలో తోపుడు బండిలో టీ అమ్మేవారు ఇకపై ప్లాస్టిక్‌ లేదా పేపర్‌ గ్లాసులను వాడకుండా తప్పనిసరిగా గాజు లేదా స్టీల్‌ గ్లాస్‌ మాత్రమే వాడాలన్నారు. అంగళ్ళ ముందు కుర్చీలు వేయరాదని, ఎక్కడపడితే అక్కడ తోపుడు బండ్లు నిలపరాదని, ప్రతి షాప్‌లో ధరల పట్టికలను ఉంచుకోవాలని, ఎంఅర్‌పి ధరలకే అమ్మాలని సూచించారు. మహానంది ఎస్‌ఐ నాగేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ క్షేత్ర ప్రతిష్టను కాపాడే విధంగా ప్రతి ఒక్క వ్యాపారస్తుడు భక్తులతో మంచి ప్రవర్తనతో మెలగాలని, భక్తులతో గొడవలు పెట్టుకోరాదని, నిషేధిత పొగాకు ఉత్పత్తులు అమ్మరాదని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, పాలకమండలి సభ్యులు, మహానంది గ్రామ వ్యాపారస్తులు పాల్గొన్నారు.