ప్రజాశక్తి - ఆలూరు
ఆలూరును కరువు మండలంగా ప్రకటించి, రైతులను ఆదుకోవాలని ఎపి రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పి.హనుమంతు, మండల కార్యదర్శి యు.ఈరన్న డిమాండ్ చేశారు. గురువారం అగ్రహారం, కురువల్లి గ్రామాల్లో రైతుల పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో జులై, ఆగస్టు నెలల్లో సరైన వర్షాలు కురవకపోవడంతో రైతులు సాగు చేసిన పత్తి, వేరు శనగ, ఆముదం, ఉల్లి, సద్ద తదితర పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. అరకొర పండిన పంటలను జింకలు, పురుగులు పడి పంట నాశనమైందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఎకరాకు రూ.20 వేలు పెట్టుబడి పెట్టారని, పెట్టుబడి కూడా చేతికొచ్చే పరిస్థితి లేదని తెలిపారు. ఈ ఏడాది మండలంలో సాధారణ వర్షపాతం కంటే చాలా తక్కువ నమోదైందని చెప్పారు. ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన సర్వేలు చేసి ఎకరాకు రూ.30 వేల పంట నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. ప్రత్యామ్యాయ పంటలు వేసుకోడానికి ఉచితంగా విత్తనాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఆలూరు మండలాన్ని కరువుగా ప్రకటించాలని ఈ నెల 25న తహశీల్దార్ కార్యాలయం ఎదుట జరిగే ధర్నాలో రైతులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. రైతులు హనుమంతప్ప, ఆంజనేయ, వీరేష్, శివ పాల్గొన్నారు.
ఆముదం పంటను పరిశీలిస్తున్న రైతుసంఘం నాయకులు










