Oct 12,2023 19:55

ఆలూరులోని జాతీయ రహదారిపై నిరసన చేపడుతున్న ప్రజలు

ప్రజాశక్తి-ఆలూరు
ఆదోని నుంచి ఆలూరు, చింతకుంట వరకు 167వ జాతీయ రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రజలు డిమాండ్‌ చేశారు. గురువారం పట్టణంలోని రోడ్డుకిరువైపులా ఉన్న దుకాణదారులు, పట్టణ ప్రజలు రోడ్డెక్కారు. నాలుగేళ్లుగా రహదారి పనులు నత్తనడకన సాగుతున్నాయి. పట్టణంలోని రోడ్డు, డ్రెయినేజీ నిర్మాణం కోసం రోడ్డుకిరువైపులా ఉన్న చిన్న వ్యాపారుల దుకాణాలను తొలగించి ఏడాది అవుతోంది. ఇంతవరకు డ్రెయినేజీ, రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంతో చిన్న వ్యాపారులు ఆర్థికంగా కోలుకోలేక పోతున్నారు. జాతీయ రహదారి నిర్మాణం ఎస్‌ఆర్‌కె కన్‌స్ట్రక్షన్‌ చేపడుతోంది. ఆలూరు పట్టణంలో, బెల్లిగుండు ఆంజనేయస్వామి నూతన విగ్రహం ఆవరణలో భయానక రోడ్డు ఉండడంతో ప్రమాదాలకు గురై మృతి చెందిన సంఘటనలూ ఉన్నాయి. మంత్రి ఇలాఖా, నియోజకవర్గ కేంద్రం అయినప్పటికీ దుమ్ము, ధూళితో పట్టణ ప్రజలు, వాహన దారులు ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్డు, డ్రెయినేజీ నిర్మాణ పనులు పూర్తి చేయాలని దుకాణదారులు, ప్రజలు ధర్నా చేపట్టారు. ట్రాఫిక్‌ స్తంభించడంతో ఎఎస్‌ఐ చంద్రశేఖర్‌ సంఘటన స్థలానికి చేరుకొని ప్రస్తుతం దుమ్ము, ధూళి లేకుండా ప్రత్యామ్నయంగా నీటి ట్యాంకర్‌ను ఉపయోగిస్తామని జనాలకు తెలపడంతో శాంతించారు.