Apr 30,2023 08:44

ప్లకార్డులు ప్రదర్శిస్తూ సమావేశానికి ర్యాలీగా వస్తున్న అసమ్మతి కౌన్సిలర్లు

         హిందూపురం : హిందూపురం పురపాలక సంఘ కౌన్సిల్‌ సాధారణ సమావేశం శనివారం మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ ఇంద్రజ అధ్యక్షతన జరిగింది. సమావేశం ప్రారంభానికి ముందే అధికార పార్టీలో అసమ్మతి కౌన్సిలర్లు మున్సిపల్‌ రెండవ వైస్‌ ఛైర్మన్‌ బలరామిరెడ్డి ఛాంబర్‌లో సమావేశమయ్యారు. సమావేశం ప్రారంభ సమయంలో అసమ్మతి కౌన్సిలర్లు మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ అవినీతి, విద్యుత్‌ దీపాల కొనుగోలులో జరిగిన అవినీతి, మున్సిపల్‌ ముఖ్య ప్రజా ప్రతినిధి భూకబ్జా, రైల్వే రోడ్డు విస్తరణ పనులు, మార్కెట్‌ తదితర అంశాలపై ప్లకార్డులను ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ నల్ల బ్యాడ్జీలను ధరించి సమావేశానికి వచ్చారు. దీనిని గమనించిన మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ కౌన్సిల్‌ సమావేశంలో రచ్చ జరుగుతుందని తెలిసి అజెండాలోని అంశాలన్నింటినీ ఆమోదం తెలుపుతున్నట్లు మిగిలిన అధికార పార్టీ కౌన్సిలర్లతో ఆమోదం తీసుకుని, సమావేశం పూర్తి అయిందని చెప్పి వెళ్లిపోయారు. దీంతో ఆగ్రహించిన అధికార పార్టీ అసమతి కౌన్సిలర్లు కౌన్సిల్‌ హాల్‌కు తలుపులు వేసి అవినీతిపై చర్చ జరగకుండా బయటకు వెళ్లకూడదని పట్టుబట్టారు. ప్రతిపక్ష కౌన్సిలర్లు ప్రజా సమస్యలపై చర్చించాలని, అజెండాలోని అంశాలపై చర్చ జరపాలని డిమాండ్‌ చేస్తూ ఛైర్‌పర్సన్‌ పోడియం ముందు బైఠాయించి నినాదాలు చేశారు. అధికార పార్టీ అసమ్మతి కౌన్సిలర్లు శివ, ఆసిఫ్‌ తదితరులు కౌన్సిల్‌ ఏర్పడి రెండు సంవత్సరాలు నుంచి పురపాలక సంఘ కార్యాలయంలో అన్ని విభాగాల్లోనూ అవినీతి రాజ్యమేలుతుందన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని మున్సిపల్‌ ముఖ్య ప్రజాప్రతినిధి భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. పురపాలక సంఘంలో అభివద్ధి పనులను చేపడుతున్న గుత్తేదారుల నుంచి మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ ఇంద్రజ పెద్ద ఎత్తున కమీషన్‌లు తీసుకుంటుందని ఆరోపించారు. అందుకోసమే గుత్తేదారులు అభివద్ధి పనులు చేయడానికి ఏ ఒక్కరు ముందుకు రావడం లేదన్నారు. నాడు విపక్షంలో ఉన్నప్పుడు వివక్షను చూపి వార్డుల అభివద్ధికి నిధులు కేటాయించలేదని, నేడు అసమ్మతిలో ఉన్నామన్న కారణంతో నిధులు కేటాయించకుండా వివక్ష చూపుతున్నారన్నారు. వీధిదీపాల కోసం కొనుగోలు చేసిన ఎల్‌ఈడి దీపాల్లో లక్షలాది రూపాయలు అవినీతి జరిగిందని దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ప్రతిపక్ష పార్టీ కౌన్సిలర్లు కనీస చర్చ లేకుండానే అజెండాలోని అంశాలను ఎలా ఆమోదిస్తారని. ప్రజా సమస్యలపై చర్చించకుండానే సమావేశాన్ని ఎలా ముగిస్తారన్నారు. ప్రజా సమస్యలపై చర్చ జరపాలని డిమాండ్‌ చేస్తూ ఛైర్‌పర్సన్‌ పోడియం ముందు బైఠాయించి నినాదాలు చేశారు. వైస్‌ ఛైర్మన్‌ బలరామిరెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు స్థానికులు అయితేనే అభివద్ధి సాధ్యమవుతుందన్నారు. హిందూపురం నుంచి ఎన్టీఆర్‌, ఆయన కుమారుడు బాలకృష్ణలు ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించినా ఈ ప్రాంతానికి చేసిన అభివృద్ధి శూన్యం అన్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ శాసన సభ్యుడిగా హిందూపురం పురపాలక సంఘంతో పాటు నియోజకవర్గాన్ని పూర్తిగా విస్మరించారన్నారు. ఇక కౌన్సిల్‌లో అధికార పార్టీ సభ్యుల నిరసనపై అసంతప్తిని వ్యక్తం చేశారు.