Feb 27,2022 12:18

క్రైమ్‌ కామెడీ సినిమాలు ఇష్టపడనివారుండరు. దొంగతనం, వాటి చుట్టూ పోలీసుల చేజింగ్‌లు ఆసక్తికరంగా ఉంటాయి. అయితే ఇలాంటి కథలు తెలుగులో తక్కువనే చెప్పాలి. అయితే ఈ మధ్య కాలంలో కొత్త దర్శకులు ఈ తరహా విభిన్నమైన పంథానే ఎంచుకుంటున్నారు. కమర్షియల్‌ కథల జోలికి పోకుండా కాన్సెప్ట్‌ని నమ్ముకుంటున్నారు. దర్శకులుగా నిరూపించుకునే కథల కోసం అన్వేషిస్తున్నారు. ఈ ప్రయాణంలో అనేకమంది విజయం సాధిస్తున్నారు. 'అనగనగా ఓ రోజు, స్వామీ రారా... బ్రోచేవారెవరురా, రాజ రాజ చోర' వంటి కాన్సెప్ట్స్‌తో కూడిన క్రైమ్‌ కామెడీ కథలు కమర్షియల్‌గా సక్సెస్‌ అయ్యాయి. ప్రస్తుతం ఇలాంటి కాన్సెప్ట్‌తో వచ్చిన చిత్రమే 'భామాకలాపం'. మరి ఈ చిత్రంలో ఆ కొత్తదనం కనిపించిందా? ప్రియమణి నటన ఎలా ఉంది? ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంది.. వంటి విషయాలు చూద్దాం..!

చిత్రం : భామాకలాపం
నటీనటులు : ప్రియమణి, జాన్‌ విజరు,
శాంతి రావు, శరణ్య ప్రదీప్‌,
కంచెరపాలెం కిషోర్‌ తదితరులు
సినిమాటోగ్రఫీ : దీపక్‌
ఎడిటింగ్‌ : విప్లవ్‌ నైషిధం
సంగీతం : జస్టిస్‌ ప్రభాకరన్‌, మార్క్‌ కె. రాబిన్‌
రచన : అభిమన్యు, జయకృష్ణ, అశ్విన్‌
నిర్మాతలు : బాపినీడు-సుధీర్‌
దర్శకత్వం : అభిమన్యు
ఓటీటీ : ఆహా

కథలోకి వెళ్తే.. మధ్యతరగతి గృహిణి అయిన అనుపమ (ప్రియమణి) తెలివైంది, ఆధునికంగా ఉంటుంది. యూట్యూబ్‌లో వంటల వీడియోలు పోస్ట్‌ చేసి, డబ్బులు సంపాదిస్తుంటుంది. ఎప్పటికప్పుడు కొత్త వంటకాలను చేయడంతో పాటు ఆమెకు ఓ వీక్నెస్‌ లాంటి అలవాటు ఉంటుంది. అదే పక్కవారి జీవితాల్లోకి తొంగిచూడటం. తన పని చేసుకుంటూనే ఎప్పుడూ పక్కింట్లోకి తొంగిచూడటం.. ఏం జరుగుతోందో తెలుసుకోవాలనుకోవటం.. ఆమె దినచర్యగా మారుతుంది. ఈమెకు తోడు పనిమనిషి శిల్ప (శరణ్య ప్రదీప్‌) సాయంతో కూపీలు లాగుతూ ఉంటుంది. ఈ ఆసక్తితోనే ఓ సారి పక్కింట్లో మొగడూపెళ్లాల గొడవ తేలుద్దామని వెళ్లి ఇరుక్కుపోతుంది. ఆ తర్వాత అనుకోకండా ఓ మర్డర్‌ కేసులో ఇరుక్కుపోతుంది. కాగా మరోవైపు కోల్‌కతా మ్యూజియంలో రూ.200 కోట్ల విలువైన పురాతన గుడ్డు మాయమవుతుంది. దీంతోపాటు నాయర్‌ (జాన్‌ విజరు) అనే విలన్‌తో లేని పోని తలనొప్పి తెచ్చుకుంటుంది. నాయర్‌ ఫోన్‌ చేసి.. విలువైన కోడిగుడ్డు గురించి అనుపమను వేధిస్తుంటాడు. అసలు ఈ నాయర్‌ ఎవరు..? ఆ గుడ్డు వల్ల అనుపమ, ఆమె కుటుంబం ఎలా ఇబ్బందుల్లో పడింది? ఈ చిక్కుల్లో నుంచి ఎలా బయటపడింది? డేనియల్‌ బాబు (కిశోర్‌ కుమార్‌) ఎవరు? ఇన్వెస్టిగేటివ్‌ ఆఫీసర్‌ పల్లవి (శాంతిరావ్‌) ఈ కేసులో ఏం తెలుసుకుంటుంది? వంటి విషయాలు తెలియాలంటే 'భామాకలాపం' చూడాల్సిందే.
     ఒక విలువైన వస్తువు పోవటం లేదా దొంగతనానికి గురవటం. అది చేతులు మారుతూ వెళ్లే క్రమంలో కథానాయకుడు / నాయికలు ఇబ్బందుల్లో పడటం.. దాని నుంచి బయటపడేందుకు వాళ్లు చేసే ప్రయత్నాలు ఇలా థ్రిల్లింగ్‌ అంశాలతో నడిచే కథ, కథానాలు ప్రేక్షకుడిని ఎప్పుడూ అలరిస్తూనే ఉంటాయి. ఈ తరహా కథతో ఓ వైపు నవ్వులు పంచుతూనే సినిమా చూస్తున్న ప్రేక్షకుడిని కథలో లీనం చేయడంలో 'భామా కలాపం' దర్శకుడు అభిమన్యు విజయం సాధించారు. సినిమా ప్రారంభమైన కొద్దిసేపటికే కథ రూ.200 కోట్ల విలువైన గుడ్డు చుట్టూ తిరుగుతుందని దర్శకుడు చెప్పేశాడు. పక్కింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగిన అనుపమ చేసే ప్రయత్నాలు, దానివల్ల ఇతరులు పడే ఇబ్బందులు నవ్వులు పంచుతాయి. క్రిమినల్స్‌ చేతిలో నుంచి పడిపోయిన గుడ్డు కోసం వాళ్లు వెతకడం, అది తిరిగి, తిరిగి అనుపమ పక్కింట్లో ఉండే ఫిరోజ్‌ వద్దకు రావడంతో కథనం మరింత ఉత్కంఠగా సాగుతుంది. ఫిరోజ్‌ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఆసక్తితో వెళ్లిన అనుపమ అనుకోని పరిస్థితుల్ల్లో హత్య చేయాల్సి రావటం, ఆ శవాన్ని మాయం చేసేందుకు ఆమె చేసే ప్రయత్నాలను ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. పోలీసుల విచారణ మొదలైన తర్వాత కథనం కాస్త నెమ్మదించినా, తర్వాత ఏం జరుగుతుందన్న ఆసక్తి మాత్రం ప్రేక్షకుడిని వెంటాడుతూనే ఉంటుంది. ద్వితీయార్ధంలో వచ్చే మలుపులు సినిమాపై మరింత ఉత్కంఠ కలిగిస్తాయి. అయితే, చివరికి సినిమాను చకచకా ముగించేసినట్టు అనిపిస్తుంది. పతాక సన్నివేశాలను ఇంకాస్త ఉత్కంఠగా తీర్చిదిద్ది ఉంటే బాగుండేది.
     ప్రియమణి నటించిన తొలి వెబ్‌ ఫిల్మ్‌ ఇది. పక్కింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగిన మహిళగా అనుపమ పాత్రలో ప్రియమణి ఒదిగిపోయింది. నాయర్‌గా జాన్‌ విజరు డిక్షన్‌ ఆకట్టుకుంటుంది. శరణ్య ప్రదీప్‌ నటన నవ్వులు పూయిస్తుంది. మిగిలిన వాళ్లు తమ పరిధి మేరకు నటించారు. దీపక్‌ సినిమాటోగ్రఫీ, విప్లవ్‌ ఎడిటింగ్‌ బాగున్నాయి. పాటలేమీ గుర్తుండిపోయేవి కావు. మార్క్‌ కె. రాబిన్‌ నేపథ్య సంగీతం సినిమాను ఎలివేట్‌ చేసింది. రచయిత, దర్శకుడు అభిమన్యు గుడ్డు చుట్టూ ఓ ఆసక్తికర కథను అల్లుకుని కామెడీ థ్రిల్లర్‌ను తీర్చిదిద్దడంలో విజయం సాధించారు. పతాక సన్నివేశాలపై ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. కుటుంబమంతా ఓ థ్రిల్లర్‌ సినిమా చూడాలంటే 'భామా కలాపం' చూడొచ్చు.