Sep 30,2023 22:04

రాష్ట్ర సదస్సుకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేస్తున్న సిపిఎం నాయకులు

        అనంతపురం కలెక్టరేట్‌ : రాష్ట్ర విభజన జరిగి సుమారు పది సంవత్సరాలు పూర్తవుతున్నా ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలో వెనుకబడిన ప్రాంతాల అభివద్ధికి ఇచ్చిన హామీలు అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కొనసాగుతోందని సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌ విమర్శించారు. శనివారం నాడు గణేనాయక్‌ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో వెనుకబడిన ప్రాంతాల రాష్ట్ర సదస్సుకు సంబంధించిన కరపత్రాలను జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఓ.నల్లప్ప, ఎం.బాలరంగయ్య, వి. సావిత్రిలతో కలిసి విడుదల చేశారు. ఈసందర్భంగా రాంభూపాల్‌ మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతాల అభివద్ధిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న నిర్లక్ష్యవైఖరికి నిరసనగా మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా సిపిఎం రాష్ట్ర సదస్సును అనంతపురంలో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు హాజరవుతున్నారు. రాయలసీమలోని ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, ఉత్తరాంధ్రలోని ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ప్రకాశం జిల్లాలు అత్యంత వెనుకబడిన జిల్లాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించినా వాటి అభివద్ధికి ఎలాంటి చర్యలూ తీసుకోవడంలేదన్నారు. రాష్ట్ర అభివద్ధి అంటే వెనుకబడిన ప్రాంతాల అభివద్ధి అని తెలిపారు. రాష్ట్ర ప్రజల హక్కుగా ఉన్న విభజన చట్టం హామీల గురించి అడగాల్సిన, పోరాడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నా కేంద్ర బిజెపి విధానాలకు మద్దతుదారుగా ఉండడం విచాకరం అన్నారు. విభజన చట్టంలో భాగంగా అనంతపురం జిల్లాలో కేంద్రీయ విశ్వవిద్యాలయం, బెల్‌, నాసెన్‌ పరిశ్రమలు, టెక్సటైల్‌ పార్క్‌, కడపలో ఉక్కు పరిశ్రమ, కర్నూలులో రూ. 400 కోట్లతో ఇండియన్‌ ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐఐఐటి), రైల్వే కోచ్‌ నిర్మాణ పరిశ్రమ, తిరుపతిలో కండలేరు ప్రాజెక్టు, చిత్తూరులో చెన్నై- విశాఖ పారిశ్రామిక కారిడార్‌ వంటి అనేక హామీల్లో గత తొమ్మిది సంవత్సరాల్లో ఒక్కటీ కూడా పూర్తి అమలు కాలేదు. కొన్ని శంకుస్థాపన దశలోనే ఆగిపోయాయన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, వంశధార వంటి ప్రాజక్టుల నిర్మాణం, నిర్వాసితులకు పునరావాసం, విజయననగరంలో నిర్మిస్తామన్నా గిరిజన కేంద్రీయ యూనివర్శిటీ, విశాఖపట్నంలో పెట్రోలియం యూనివర్శిటీలు ఇప్పటి వరకు పూర్తికాలేదన్నారు. ఇదిచాలదన్నట్లు విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించడానికి అనేక ప్రయత్నాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో వెనుకబడిన ప్రాంతాల అభివద్ధి కోసం పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. అందులో భాగంగా సిపిఎం రాష్ట్ర సదస్సు అనంతపురంలో జరుగుతుందన్నారు. ఈ సదస్సుకు రాయలసీమ, ప్రకాశం జిల్లాల నుండి ప్రతినిధులు హాజరవుతున్నారు. సిపిఐ, సిపిఐఎంఎల్‌, సిపిఐఎంఎల్‌ (న్యూడెమోక్రసీ) ఎసుసిఐ (సి) జిల్లా కార్యదర్శులు, మానవహక్కుల వేదిక నాయకులు చంద్రశేఖర్‌, బాషా, బోస్‌ తదితరులు ఇందులో పాల్గొంటారని చెప్పారు.