ఆక్రమణలు తొలగిస్తున్న మున్సిపల్ ఉద్యోగులు
ప్రజాశక్తి - ఆదోని
ప్రభుత్వ భూములు, వంక పొరంబోకు స్థలాల్లో అక్రమంగా నిర్మాణాలు చేపడితే తొలగింపు ముమ్మరం చేస్తామని మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ శ్రీనివాసులు హెచ్చరించారు. గురువారం పట్టణంలోని రాయనగర్ వద్ద ప్రవహిస్తున్న వంక స్థలంలో ఏర్పాటు చేసుకున్న కట్టడాలను తొలగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్మాణాలు చేపడితే తొలగించి, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆదోనిలో ఇప్పటికే అక్రమ కట్టడాలు గుర్తించి పలువురికి నోటీసులు ఇచ్చామన్నారు. సరైన సమాధానం రాకపోతే వాటిని కూడా త్వరలో తొలగిస్తామన్నారు. ప్రభుత్వ స్థలాలను గుర్తించి ఇప్పటికే బోర్డులు ఏర్పాటు చేసి అన్యాక్రాంతం కాకుండా ఇనుప కంచెలు వేసినట్లు తెలిపారు.










