ప్రజాశక్తి -పార్వతీపురం టౌన్ : పట్టణంలోని నాలుగో వార్డు పరిధిలో ఎస్‌ఎన్‌ఎం నగర్‌కు ఆనుకొని ఉన్న దేవునిబందను ఆక్రమించిన వ్యక్తిని శిక్షించి, రెవెన్యూ అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని సిపిఎం సీనియర్ నాయకులు ఎం.కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన సిపిఎం పట్టణ కమిటీ నాయకులు గొర్లి వెంకటరమణ, బంకురు సూరిబాబుతో కలిసి దేవునిబంద మధ్యలో ఆక్రమించి వేసిన వేసిన రోడ్డును పరిశీలించారు. అనంతరం కృష్ణమూర్తి మాట్లాడుతూ సర్వే నెంబరు 343లో 4 ఎకరాల 93 సెంట్లు విస్తీర్ణం ఉన్న ఈ బంద ఇప్పటికే కొంత భాగం ఆక్రమణలకు గురైందన్నారు. బంద మధ్య నుంచి ఒక వ్యక్తి తమ జిరాయితి భూమికి వెళ్లేందుకు రహదారి పనులు ప్రారంభించడానికి అధికారులు ఎలా అనుమతులు ఇచ్చారు? ఎందుకు ఇచ్చారని; ప్రభుత్వం లేఅవుట్ వేసి ఇళ్లు లేని పేద ప్రజలకు స్థలాలను ఇవ్వాలనుకుంటు న్నారా అని ప్రశ్నించారు. ఇప్పటికే పట్టణంలో దాదాపు అన్ని చెరువులు ఆక్రమణలకు గురయ్యా యని, ఈ దేవునిబందపై 2008లో పేదవారికి ఇళ్ల స్థలాలను ఇవ్వాలని సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టామని తెలిపారు. స్థలాలను స్వాధీనం కూడా చేశామన్నారు. అప్పట్లో తహశీల్దార్‌గా ఉన్న సీతాపతి 311 మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు పట్టాలు తయారు చేశారని, ఇంతలో కొంతమంది వ్యక్తులు కోర్టుకు వెళ్లడంతో ఆ ప్రక్రియ ఆగిపోయిందని అన్నారు. ఈ బందకు ఆయకట్టు కూడా లేదన్నారు. 311 మందిలో ఇప్పుడు కొందరికి ఇళ్లు వచ్చి ఉండవచ్చని, అలాంటి వారిని ఆ జాబితాలో తొలగించి మిగిలిన వారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. బెలగాంలో ఉన్న చెరువు వీధిలో అధికారులు పట్టాలు ఇచ్చారని, ఇప్పుడు నిర్మాణాలు చేస్తుంటే ఇది చెరువు అని అడ్డుకుంటున్నారని వారికొక న్యాయం వీరికొక న్యాయమా అని ప్రశ్నించారు. బందమధ్యలో ఒక వ్యక్తి ఆక్రమణ చేసి రహదారి వేస్తుంటే రెవెన్యూ అధికారులు కళ్లు మూసుకు న్నారా, అవినీతికి పాల్పడుతున్నారా, లేక రాజకీయ ఒత్తిళ్లకు గురవుతున్నారా అని ప్రశ్నించారు. వెంటనే సంబంధిత వ్యక్తిని శిక్షించి, ఆ వ్యక్తికి అనుమతులు ఇచ్చిన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని, బందకు నాలుగు వైపుల బౌండరీని ఏర్పాటు చేయాలని, లేనిచో భవిష్యత్ కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు.










