ప్రజాశక్తి - పుట్టపర్తి రూరల్ : మట్టిని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఆర్డీవో భాగ్యరేఖ హెచ్చరించారు. మండల పరిధిలోని పలు గ్రామాల్లో అక్రమ మట్టి తరలింపుపై ఫిర్యాదులు రావడం, పలు పత్రికలలో కథనాలు ప్రచురించడంతో ఆమె స్పందించారు. ఆర్డీవో ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది కర్ణాటక నాగేపల్లి, ఎద్దుల కొండ, తదితర ప్రాంతాలకు బుధవారం వెళ్లి మట్టి తరలించిన తీరును పరిశీలించారు. అక్రమ మట్టి తరలింపు జరుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వ భూములలో ఎక్కడపడితే అక్కడ మట్టిని త్రవ్వి తరలిస్తే సంబంధిత వ్యక్తులను వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. మట్టి తోలుకోవడానికి అనుమతి తప్పనిసరిగా ఉండాలని అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. అలా దరఖాస్తు చేసుకున్న వాటిని పరిశీలించి మైన్స్ అండ్ జియాలజీకి ఆమోదం కోసం పంపి అనుమతులు మంజూరు చేస్తామని చెప్పారు.










