ప్రజాశక్తి - బలిజిపేట : స్థానిక మండల పరిషత్ కార్యాలయం లో మంగళవారం నిర్వహించిన ప్రజావేదికలో ఉపాధి హామీ చట్టం కింద చేపట్టిన పనులపై సామాజిక తనిఖీ నిర్వహించారు. ఉపాధిహామీ సిబ్బంది అక్రమాలపై ప్రాజెక్టు డైరెక్టర్ కె.రామచంద్రరావు ఫీల్డ్ , టెక్నికల్ అసిస్టెంట్లను ఆరా తీశారు. ఈ సందర్భంగా వారి పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 2022 ఏప్రిల్ నుంచి 2023 మార్చి 31 వరకు ఆర్థిక సంవత్సరంలో జరిగిన పనులపై సామాజిక తనిఖీ నిర్వహించారు. మండలంలోని 24 పంచాయతీల ఆర్థిక సంవత్సర ఉపాధి పనులు, విధుల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వివిధ పనుల నిమిత్తం రూ.19.78 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఉపాధి హామీ పథకంలో రూ.17 కోట్ల 18 లక్షల పంచాయతీరాజ్ పనులకు రూ.కోటీ 22 లక్షల, సర్వ శిక్ష అభియాన్ పనులకు మూడు లక్షల 25 వేలు పి.ఆర్.ఐ పనులు కింద ఒక కోటి 14 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. వెటర్నరీశాఖకు రూ.1,86,000 కేటాయించినట్లు తెలిపారు. అనంతరం సోషల్ ఆడిట్ సిబ్బంది పంచాయతీల వారీగా అందించిన వివరాల మేరకు ఫీల్డ్ అసిస్టెంట్ల విధి నిర్వహణలోటుపాట్లను పరిశీలించారు. అలసత్వం వహించిన ఫీల్డ్ అసిస్టెం ట్లను మందలించారు. దిద్దుబాట్లతో కూడిన మాస్తర్లు ఉండకూదన్నారు. వాలంటీర్లకు మూడు రోజుల పని కల్పించాలని, జాబ్ కార్డు అప్డేట్ తప్పనిసరి ఆదేశించారు. అనంతరం జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో స్టేట్ రిసోర్స్‌పర్సన్ ఎస్.గోవింద్, కె.తిరుపతిరావు, జెడ్‌పిటిసి సభ్యులు అలజింగి రవికుమార్, ఎంపిపి నాగమణి, ఎంపిడిఒ కె.విజయలక్ష్మి, ఎపిఒ కేశవరావు, ఇసి సిహెచ్.శ్రీనివాసరావు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.










