Oct 03,2023 22:28

నిందితుల వివరాలను వెల్లడిస్తున్న డీఎస్పీ శ్రీనివాసులు

           ప్రజాశక్తి-రాయదుర్గం    అక్రమ సంబంధం నేపథ్యంలో హత్య చేయడంతోనే బొమ్మనహాల్‌ మండల పరిధిలోని తుంగభద్ర ఎగువ కాలువలో శవం తేలిందని డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. బొమ్మనహాల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని తుంగభద్ర ఎగువ కాలువలో గతవారం శవమై తేలిన మృతదేహం కేసును ఎస్పీ కెకెఎన్‌ అన్బురాజన్‌ ఆదేశాల మేరకు రాయదుర్గం రూరల్‌ పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు. మంగళవారం రాయదుర్గంలోని రూరల్‌ పోలీస్‌ సర్కిల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బొమ్మనహాల్‌ మండలం మైలాపురం గ్రామం సమీపంలోని తుంగభద్ర ఎగువ కాలువలో ఓ గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహం తేలాడుతూ కాళ్లు, చేతులు తాళ్లతో కట్టివేసినట్లు గుర్తించారు. దీనిపై మైలాపురం గ్రామ రెవెన్యూ అధికారి కుళ్లాయిస్వామి ఫిర్యాదు మేరకు బొమ్మనహాల్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈనేపథ్యంలో కళ్యాణదుర్గం డీఎస్పీ బి.శ్రీనివాసుల పర్యవేక్షణలో రాయదుర్గం రూరల్‌ సిఐ వి.యుగంధర్‌, బొమ్మనహాల్‌ ఎస్‌ఐ జి.శివ, డి.హీరేహాల్‌ ఎస్‌ఐ జి.రంగడుయాదవ్‌, సిబ్బంది రెండు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కేసును ఛేదించినట్లు తెలిపారు. గుర్తు తెలియని మృతదేహం కర్నాటకలోని బళ్లారి వాసి ఎం.వినోద్‌రాజ్‌ (30)గా పోలీసులు గుర్తించారు. కేసును ఆరాతీయగా వినోద్‌రాజ్‌కు మల్లికార్జున మధ్య సమస్యలు ఉన్నాయి. దీంతో వినోద్‌రాజ్‌ను ఎలాగైనా హతమార్చాలని మల్లికార్జున భావించి తన స్నేహితులైన ఆదినారాయణ, పవన్‌కళ్యాణ్‌, వడ్డే రమేష్‌, పాండుతో కలిసి గతనెల 26న రాత్రి వినోద్‌రాజ్‌ను ఇంటికి రమ్మని పిలిపించుకున్నారు. వచ్చీరాగానే తలుపులు మూసేసిన నిందితులు మూకుమ్మడిగా కాళ్లు, చేతులను తాడుతో కట్టి మూతికి బట్ట పెట్టారు. అక్కడి నుంచి ట్రాక్టర్‌లో మృతదేహాన్ని తీసుకుని బళ్లారి నగర శివారులో కృష్ణానగర్‌ దగ్గర తుంగభద్ర ఎగువ కాలువపై ఉన్న ఐరన్‌ బ్రిడ్జిపై వేశారు. కట్టిన తాళ్లను విప్పుకోలేక, నీటి నుంచి బయటికి రాలేక ఊపిరాడక చనిపోయి నీటి ప్రవాహానికి కొట్టుకుని మైలాపురం గ్రామం వద్ద శవమై నీటిలో తేలియాడుతూ కనిపించాడు. దీంతో కేసును ఛేదించి నిందితులను అదుపులోకి తీసుకోవడంతోపాటు ట్రాక్టర్‌, 3 ద్విచక్ర వాహనాలు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన సిబ్బందిని డీఎస్పీతోపాటు ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో రాయదుర్గం రూరల్‌ సీఐ యుగంధర్‌, పోలీస్‌ ఇన్స్‌పెక్టర్‌ లక్ష్మన్న, బొమ్మనహాల్‌ ఎస్‌ఐలు శివ, రంగడు సిబ్బంది పాల్గొన్నారు.