ప్రజాశక్తి-పెనుకొండ పట్టణంలోని దర్గాపేటలో రహదారికి అడ్డంగా నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించాలని సిపిఎం ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు దర్గాపేటవాసులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా సిపిఎం మండల కార్యదర్శి రమేష్, దర్గాపేటవాసులు మాట్లాడుతూ దర్గాపేటలోని సర్వేనెంబర్ 221లో రహదారికి అడ్డంగా గుంతకల్లుకు చెందిన నబిరసూల్ అనే వ్యక్తి రాత్రికి రాత్రే కాంపౌండ్ నిర్మించాడన్నారు. నగర పంచాయతీ ఛైర్మన్ ఉమర్ ఫరూక్ అండతో రోడ్డుకు అడ్డంగా రాత్రికి రాత్రి పబ్లిక్ కొళాయిని పూడ్చి అక్రమంగా గోడ నిర్మించారని ఆరోపించారు. ఈ విషయమై అనేకసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. దీంతో నాలుగు నెలల నుంచి పిల్లలు, వృద్ధులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈనేపథ్యంలోనే ఆదివారం డ్రెయినేజీలో పడి ఓ వృద్ధుడు తీవ్ర గాయాలపాలయ్యాడన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డును ఆక్రమించిన వ్యక్తిపై చర్యలు తీసుకుని అక్రమ నిర్మాణానికి తొలించాలని సబ్‌కలెక్టర్ కార్తీక్‌కు వినతిపత్రం సమర్పించారు. ఇందుకు సబ్ కలెక్టర్ స్పందిస్తూ అక్రమ నిర్మాణానికి తొలగిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి రమేష్, సిఐటియు మండల కార్యదర్శి బాబావలి, నాగప్ప, దర్గాపేటవాసులు మౌలా, ఫైజాన్, ఖాదర్‌బాషా, ఖలీల్, ముక్తం, జబ్బార్, అలీ, ఫరూక్, నూర్జాహాన్, ముంతాజ్, రమా, తదితరులు పాల్గొన్నారు.
ధర్నా నిర్వహిస్తున్న సిపిఎం నాయకులు










