ప్రజాశక్తి - కౌతాళం
తుంగభద్ర దిగువ కాలువ పరిధిలోని అక్రమ ఆయకట్టు కళకళలాడుతోంది. ఆయకట్టు కింద మాత్రం పంటలు ఎండిపోయి రైతులు విలవిల్లాడుతున్నారు. అక్రమ ఆయకట్టుకు సాగునీరు పుష్కలంగా అందుతోంది. ఆయకట్టు రైతులకు సాగునీరు అందకపోవడంతో కన్నీరు పెడుతున్నారు. కౌతాళం మండలంలోని తుంగభద్ర దిగువ కాలువ కింద టిఎస్, 74, 75, కౌతాళం మేజర్, మాధవరం మేజర్ డిస్ట్రిబ్యూటర్ల కింద పత్తి, మిరప, వరి పంటలు సాగు చేశారు. ఈ డిస్ట్రిబ్యూటర్ల కింద ఆయకట్టు పొలాలకు సాగునీరు అందించాల్సిన ఉంది. మాధవరం మేజర్ డిస్ట్రిబ్యూటర్ కింద ఉరుకుంద, చిరుతపల్లి, మల్లనహట్టి, చూడి, బంటకుంట, సులేకేరి, మధిరే, పొదలకుంట, హాల్వి, గోతులదొడ్డి, కుంభాలనూర్, అగసలదిన్నె, కాత్రికి గ్రామాల పరిధిలోని ఆయకట్టుకు సాగునీరు అందించాల్సి ఉంది. ఈ కాలువల పరిధిలో అక్రమ ఆయకట్టు గణనీయంగా సాగవుతోంది. సాగునీరు మాత్రం అక్రమ ఆయకట్టుదారులు పొలాలకు మళ్లిస్తున్నారు. కింద ఉన్న ఆయకట్టుకు మాత్రం సాగునీరందక పంటలు ఎండిపోతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ ఆయకట్టు కాలువల పరిధిలో పగలు, రాత్రి తేడా లేకుండా ఆయిల్ ఇంజిన్లతో, ట్రాక్టర్లతో సాగునీటిని అక్రమ ఆయకట్టుకు మళ్లిస్తున్నారు. ప్రతి కాలువపైనా ఈ ఇంజిన్ల సౌండ్ వినపడుతున్నా తుంగభద్ర దిగువ కాలువ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. గతంలో అక్రమంగా నీటిని మళ్లిస్తే పోలీసు స్టేషన్‌లో అధికారులు ఫిర్యాదు చేసి కేసులు నమోదు చేసేవారు. ఇలా కాకుండా మామూళ్ల మత్తులో సంబంధిత అధికారులు ఉండడంతో అక్రమ ఆయకట్టుదారులకు భయం లేకుండా పోయింది. విచ్చలవిడిగా అక్రమ ఆయకట్టుకు సాగునీరు ఉపయోగిస్తుండడంతో కింద ఉన్న ఆయకట్టు పొలాలకు సాగునీరు అందడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. అసలే వర్షాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్న రైతులకు, కనీసం సాగునీరు కూడా అందకపోవడంతో ఆర్థికంగా తీవ్ర నష్టపోతామని రైతులు ఇటీవల తుంగభద్ర దిగువ కాలువ డిఇ మహ్మద్ సైఫుల్లా దృష్టికి తీసుకొచ్చారు.
ఎకరాకు రూ.1000 నుంచి రూ.2 వేల వరకు వసూలు
వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో సాగునీటికి డిమాండ్ పెరిగింది. ఎల్‌ఎల్‌సి కింద సాగు చేసిన పంటలకు నీటి కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఇదే అదునుగా భావించి రైతుల నుంచి ఎకరాకు రూ.1000 నుంచి రూ.2 వేల వరకు అక్రమంగా వసూలు చేస్తున్నారు. రైతులు అధికారులకు డబ్బులు చెల్లించి ఇంజిన్లు. ట్రాక్టర్లు పెట్టి నీటిని అక్రమంగా వాడుకుంటున్నారు. ముఖ్యంగా హాల్వి సెక్షన్లలో ఎక్కువగా జరుగుతుండడంతో ఆయకట్టు రైతులకు అన్యాయం జరుగుతోంది. గత వారంలో ఎల్‌ఎల్‌సి డిఇ ముందే ఒక రైతు ఎకరాకు రూ.2 వేలు వసూలు చేస్తున్నారని పేర్కొనడమే ఇందుకు నిదర్శనం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ ఆయకట్టును అరికట్టి, ఆయకట్టు రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.










