Jul 20,2023 17:25

నిరసన ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం

అక్రమ అరెస్టులతో పోరాటాలను ఆపలేరు

ఎస్ఎఫ్ఐ నాయకుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ రోడ్ ఎక్కిన విద్యార్థులు  
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకు క్షమాపణ చెప్పి ఉచితంగా  పుస్తకాలు అందించేంతవరకు పోరాటం ఆగదు
ప్రజాశక్తి - నంద్యాల

       విజయవాడ,  తాడేపల్లి ,  ఇంటర్మీడియట్ బోర్డు  వద్ద ఎస్ఎఫ్ఐ  నాయకులను అక్రమంగా  అరెస్టు చేయడంపై గురువారం నంద్యాల జిల్లా వ్యాప్తంగా  అక్రమ అరెస్టులను ఖండిస్తూ జరిగిన నిరసన కార్యక్రమం లో భాగంగా నంద్యాల ప్రభుత్వ జూనియర్ కాలేజ్  విద్యార్థులతో  ర్యాలీగా పొగాకు కంపెనీ సర్కిల్ వరకు వెళ్లి రాస్తా రోకో చేయడం జరిగింది. విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు ఇవ్వమంటే అక్రమంగా అరెస్టు చేయడం సిగ్గుగా లేదా అని ఎస్ ఎఫ్ ఐ నంద్యాల జిల్లా అధ్యక్షుడు డక్కా కుమార్, జిల్లా సహాయ కార్యదర్శి కిరణ్, బత్తిని ప్రతాప్ లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నంద్యాల జిల్లా అధ్యక్షుడు డక్కా కుమార్, సహాయ కార్యదర్శి మధు కిరణ్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకుని ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందించలేమంటూ విద్యార్థులు పాఠ్యపుస్తకాలు కొనుక్కోవాలంటూ ఇంటర్ విద్యాశాఖ ఆదేశించడాని  ఖండిస్తున్నామన్నారు. గత మూడు సంవత్సరాల నుండి ఇంటర్మీడియట్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందించడం లేదని, పాఠ్య పుస్తకాలు అందించకపోతే ఇంటర్ విద్యార్థులు ఏ రకంగా చదువుకోవాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామన్నారు . మా ప్రభుత్వం విద్యకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నామంటూ గొప్ప గొప్ప మాటలు చెప్తున్నా రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖకు సంబంధించిన మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటర్మీడియట్ విద్యకు ప్రత్యేక నిధులు కేటాయించకపోగా విద్యార్థులు ఫీజులు ద్వారా కట్టిన ఇంటర్ విద్యామండలి నిధులు మొత్తం నాడు-నేడు పథకానికి దారి మళ్లించడాన్ని సిగ్గుచేటుగా భావిస్తున్నామన్నారు . వెంటనే ఇంటర్మీడియట్ విద్యకు ప్రత్యేక నిధులు కేటాయించి ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందజేయాలని, అదేవిధంగా జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలని అనేక జూనియర్ కళాశాలలో అధ్యాపక పోస్టులు ఖాళీ ఉండటంతో ఆ సబ్జెక్టు బోధించే అధ్యాపకులు లేక విద్యార్థులు ఫెయిల్ అవుతున్న పరిస్థితి నెలకొందని అన్నారు. వెంటనే అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేయాలని,లేనియెడల రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కార్యచరణతో ఆందోళనలకు పూనుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి రమణ, బత్తినేని ప్రతాప్ , మరియు నాయకులు మహేష్ , సిద్ధార్థ్ , బన్నీ , మధు, గోపాల్,  విద్యార్థులు పాల్గొన్నారు.