Aug 24,2023 21:38

పాలకొండలో మానవహారం చేపట్టిన పారిశుధ్య కార్మికులు

ప్రజాశక్తి - పార్వతీపురం టౌన్‌: కార్మికులను ముందస్తు అరెస్టులు, గృహనిర్బంధం చేయడం సరైన పద్ధతి కాదని ఈ అక్రమ అరెస్టులను ప్రతి ఒక్కరు ఖండించాలని సిఐటియు జిల్లా నాయకులు అన్నారు. మున్సిపల్‌ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని గురువారం తలపెట్టిన చలో అసెంబ్లీకి బయలుదేరిన కార్మిక సంఘ నాయకులను, కార్మికులను గృహనిర్బంధాలు, అరెస్టులు చేయడానికి నిరసనగా మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ పారిశుధ్య కార్మికులు స్థానిక మున్సిపల్‌ కార్యాలయం నుండి ప్రధాన రహదారి గుండా ర్యాలీ నిర్వహిస్తూ ఆర్టీసీ కూడలి వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారం కోరుతూ అనేక రూపంలో ప్రభుత్వానికి, అధికారులకు సుదీర్ఘకాలంగా తెలుపుతున్నప్పటికీ స్పందించడంలేదన్నారు. ఇందులో భాగంగా గురువారం తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమం జయప్రదం చేసేందుకు వెళ్తున్న మున్సిపల్‌ కార్మికులను ప్రభుత్వం పోలీసులచే నిర్బంధించడం అన్యాయమని అన్నారు. మున్సిపల్‌ ఆప్కాస్‌ విధాన పారిశుధ్య కార్మికులు, ఇంజనీరింగ్‌ వర్కర్స్‌, క్లాప్‌ ఆటో డ్రైవర్‌ సమస్యలు పరిష్కరించాలని, కార్మికులందర్నీ పర్మినెంట్‌ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి యమ్మల మన్మధరావు, కోశాధికారి గొర్లి వెంకటరమణ, ఉపాధ్యక్షులు వి.ఇందిర పట్టణ నాయకులు బంకూరు సూరిబాబు, పట్టణ పౌర సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పాకల సన్యాసిరావు, సంచాన ఉమా, కార్మికుల జిల్లా అధ్యక్షులు నాగవంశం శంకర్రావు, నాగవంశం మల్లేష్‌ ,మామిడి శివ, నాగవంశం నిర్మల, గంగయ్యలు,పడాల గాంధీ, నరేష్‌ ,గౌరమ్మ, ఇప్పలమ్మ,లక్ష్మి సుజాత మరియు మేస్త్రీలు డ్రైవర్లు వాటర్‌ సెక్షన్‌ కార్మికులు పాల్గొన్నారు.
సాలూరు: మున్సిపల్‌ కార్మికులను రెగ్యులర్‌ చేయకపోతే సమ్మెకు దిగనున్నామని మున్సిపల్‌ వర్కర్స్‌, ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ జిల్లా కార్యదర్శి ఎన్వైనాయుడు హెచ్చరించారు. ఛలో విజయవాడ కార్యక్రమానికి మద్దతుగా పట్టణం మున్సిపల్‌ కార్మికులు ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. మున్సిపల్‌ కార్యాలయం నుంచి బయలు దేరిన ర్యాలీ ప్రధాన రహదారి మీదుగా సాగింది. అనంతరం యూనియన్‌ బ్యాంక్‌ జంక్షన్‌ లో రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ఎన్వైనాయుడు మాట్లాడుతూ మున్సిపల్‌ కార్మికుల సమస్యల్ని పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. కార్మికులకు సబ్బులు, నూనెలు కూడా ఇవ్వడం లేదని చెప్పారు. పెరుగుతున్న జనాభా దృష్ట్యా కార్మికుల సంఖ్య పెంచాలని కోరారు. కార్యక్రమంలో మహిళా కమిటీ కన్వీనర్‌ టి.ఇందు, ఫెడరేషన్‌ పట్టణ నాయకులు టి.శంకరరావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.
పాలకొండ రూరల్‌ : మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ ఔట్సోర్సింగ్‌ కార్మికులందర్నీ వెంటనే పర్మినెంట్‌ చేయాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, ముఖ్యమంత్రి మున్సిపల్‌ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఇంజనీరింగ్‌ కార్మికులకు రిస్కు, హెల్త్‌ అలవెన్స్‌ అమలు చేయాలని కోరుతూ ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ సిఐటియు ఆధ్వర్యంలో విజయవాడలో మహా ధర్నా జరుగుతున్న సందర్భంగా పాలకొండలో మున్సిపల్‌ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించి ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఆవరణలో మానవహారం నిర్వహించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు మున్సిపల్‌ యూనియన్‌ అధ్యక్షులు పడాల భాస్కరరావు, చింతల సురేష్‌, శ్రీదేవి, విమల, రఘు, వండాన ఆంజనేయులు, భోగి విషు, టి ఈశ్వర్‌, పి శ్రీనివాసు, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.