Oct 02,2023 20:55

మూతపడ్డ జ్యూట్‌మిల్లు

సాలూరు: మన్యం జిల్లాలో ఉన్న ఏకైక పరిశ్రమ ఆంధ్రా ఫైబర్స్‌ జ్యూట్‌ మిల్లు మూతపడి 16నెలలు దాటిపోయింది. మిల్లు యాజమాన్యం అక్రమ లాకౌట్‌ ప్రకటించడంతో 1200 కార్మిక కుటుంబాలు అర్ధాకలితో అలమటిస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఎవరి దగ్గరకి వెళితే తమ బతుకులు బాగు పడతాయో తెలుసుకుని అందరి గడపలూ కార్మికులు తొక్కుతున్నారు. మిల్లు మూతపడడంతో కార్మికుల జీవితాలు అగమ్యగోచరంగా మారాయి. ఎక్కడ బతుకు తెరువు కనిపిస్తుందో అక్కడకి వెళ్లిపోవాలన్న ఆశగా ఎదురు చూస్తున్నారు. కుటుంబాలను పోషించుకోడానికి మరో గత్యంతరం లేక కొంతమంది కార్మికులు తోపుడు బండ్లు నడుపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి కొందరు టీ దుకాణాల నిర్వహణలో ఉన్నారు. కొంతమంది వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. గత 42రోజులుగా కార్మిక సంఘాల జెఎసి ఆధ్వర్యాన జ్యూట్‌ మిల్లు కార్మికులు దశలవారీ పోరాటానికి నడుం బిగించారు. ధర్నాలు, కుటుంబ సభ్యులతో ర్యాలీలు చేశారు. ఫ్యాక్టరీ గేటు ముందు రిలే దీక్షలు చేపడుతున్నారు.
నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్న యాజమాన్యం
మండలంలోని జీగిరాం జూట్‌ మిల్లును తెరిపించడంలో యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతోంది. కార్మికశాఖ జాయింట్‌ కమిషనర్‌ వద్ద కార్మిక సంఘాలతో చర్చలకు రెండు సార్లు డుమ్మా కొట్టింది. ఈ రెండు సార్లు ఎంతో ఆశతో కార్మిక సంఘాల నాయకులు జెసిఎల్‌ వద్ద చర్చలకు హాజరయ్యారు. అయితే యాజమాన్య ప్రతినిధులు హాజరు కాలేదు. దీంతో యాజమాన్యం ఉద్దేశపూర్వకంగానే కార్మికుల పట్ల మొండిగా వ్యవహరిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
డిప్యూటీ సిఎం లేఖ రాసినా
జీగిరాం జ్యూట్‌ మిల్లు కార్మికులు జెఎసి ఆధ్వర్యాన అక్రమ లాకౌట్‌ సమస్యను డిప్యూటీ సిఎం రాజన్నదొర దృష్టికి తీసుకెళ్లారు. మిల్లును తెరిపించడంలో యాజమాన్యం అనుసరిస్తున్న వైఖరి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కోరారు. దీంతో ఆయన ఘాటుగా కార్మిక శాఖ జాయింట్‌ కమిషనర్‌కు లేఖ రాశారు. ఆయన లేఖ రాసిన తర్వాత చర్చలకు పిలిచినా యాజమాన్యం హాజరు కాలేదు. యాజమాన్యం మొండి వైఖరి కార్మిక శాఖ ఉన్నతాధికారులు కఠినంగా స్పందించాల్సి ఉన్నప్పటికీ అటువంటి దాఖలాల్లేవు.
మిల్లు ఆస్తుల్ని విక్రయించే యత్నంలో యాజమాన్యం
1986లో ఆంధ్రా ఫైబర్స్‌ జ్యూట్‌ మిల్లును అప్పటి టిడిపి ప్రభుత్వం స్థాపించింది. అత్యంత వెనుకబడిన గిరిజన ప్రాంతంలో గిరిజనులకు ఉపాధి కల్పన ప్రధాన ధ్యేయంగా జూట్‌ మిల్లును ప్రారంభించారు. సుమారు 50ఎకరాల భూములు సేకరించి మిల్లు, కార్మికుల నివాసానికి కాలనీ ఏర్పాటు చేశారు. క్రమేణా మిల్లు నిర్వహణ బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పుకోవడంతో ప్రయివేటు వ్యాపారులు కొనుగోలు చేశారు. ప్రయివేటు యాజమాన్యం కొంతకాలం సజావుగా నడిపించి జ్యూట్‌ కొరత సాకుగా చూపి కొంతకాలం మిల్లును మూసివేసింది. కరోనా సంక్షోభ సమయంలో మిల్లును పూర్తిగా మూసివేశారు. గత 16నెలలుగా మిల్లును అక్రమంగా లాకౌట్‌ ప్రకటించింది. కార్మిక సంఘాలతో చర్చలకు కూడా యాజమాన్యం వెనుకాడుతోంది. జాతీయ రహదారి-26 కి పక్కనే ఉన్న మిల్లు ఆస్తులకు మార్కెట్‌ విలువ బాగా పెరిగింది. దీంతో యాజమాన్యం ఆస్తులను విక్రయించే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే మిల్లు ఆస్తులు ప్రభుత్వం పేరిట రెవెన్యూ రికార్డుల్లో ఉండడంతో అమ్మకానికి వీలు కాని పరిస్థితి నెలకొంది. దీంతో యాజమాన్యం కోర్టులో కేసు వేసినట్లు తెలుస్తోంది. కోర్టు కేసు తెగేదాకా యాజమాన్యం మిల్లును మూసివేసే ఉద్దేశంతో వున్నదనే వాదనలు వినిపిస్తున్నాయి.