అకాల వర్షం..పంటలకు నష్టం
ప్రజాశక్తి-గుడ్లవల్లేరు, అవనిగడ్డ, ఉయ్యూరు
కృష్ణాజిల్లా, ఎన్‌టిఆర్ విజయవాడ జిల్లాలో శని, ఆదివారాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. ఈదురుగాలులకు పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలంలో గుడ్లవల్లేరు- ముదినేపల్లి వెళ్లే రహదారిలో కూరాడ వద్ద భారీ వృక్షం రహదారిపై కూలిపోవడంతో రాకపోకలు నిలచిపోయాయి. రెవెన్యూ శాఖ అధికారులు యుద్ధప్రాతిపదికన స్పందించి చెట్లను తొలగించే ఏర్పాటుచేశారు. గుడ్లవల్లేరు జేమ్స్ పేటలోని వర్రే విజరురావు ఇంటిపైన సిమెంట్ రేకులు గాలికి లేచిపడిపోయాయి. డోకిపర్రులో జే.రాజు నివాస గృహంపై తాడి చెట్టు పడి ధ్వంసమైంది. ఎంపీపీ కొడాలి సురేష్ మండలంలో ధ్వంసం కాబడిన నివాస గహాలను పరిశీలించారు. గ్రామాల్లోని వీఆర్వోలు ఆ గ్రామాల్లో పాక్షికంగా, పూర్తిగా ధ్వంసమైన గృహాలను నమోదు చేశారు. పలు గ్రామాల్లో శనివారం రాత్రి నుండి విద్యుత్ తీగలు తెగిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ శాఖ ఎఇఇ కె.సుబ్బారెడ్డి తన సిబ్బందితో వెళ్లి విద్యుత్ పునరుద్ధిరించారు. పంట పొలాల్లో మినుప కాడ వర్షం కారణంగా నీట మునిగి మినుములు ఉబ్బిపోయాయి. ఎన్టీఆర్ జిల్లాలో కంచికచర్ల, నందిగామ,చందర్లపాడు, వీరులపాడు మండలాల పరిధిలోని కళ్లాల్లో ఉన్న మిర్చి వర్షానికి తడిచిపోయాయి. దివిసీమలో గత మూడు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు రబీలో సాగుచేసిన మినుము, పెసర, ఉధ్యానవన పంటలైన టమాట, బీర, సొర, దోస లాంటి తీగపాదు పంటలు కూడా పూర్తిగా దెబ్బ తిన్నాయి. అదే విధంగా ఈదురుగాలులకు మొక్కజొన్న పంట కూడా నేలకొరిగింది. దీంతో రబీ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. గత మూడు రోజుల నుండి 8.5 సెంటీమీటర్ల వర్షపాతం అవనిగడ్డ ప్రాంతంలో నమోదు కాగా దీనితో అపరాల పంటలు మునిగిపోవడంతో పాటు కొంత పంట పనుల మీద ఉండి పూర్తిగా తడిసిపోయింది. రైతులు తీవ్ర కలత చెందుతున్నారు ఖరీఫ్‌లో మాండూస్ తుఫాన్ కారణంగా డిసెంబర్లో కురిసిన భారీ వర్షాలకు వరి పంట ముంపునకు గురైంది. కనీసం రబీలో సాగులో అపరాల పంటలైన గట్టెక్కిస్తాయని ఆశతో ఉన్న రైతుకు ఈ వర్షాలు తీవ్రంగా దెబ్బతీయటంతో పాటు వారి ఆశలను అడియాసలు చేశాయి. దీనితో రైతు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతుండగా చేసిన అప్పులు ఏ విధంగా తీర్చాలో తెలియక సతమతమవుతున్నారు. అకాల వర్షం, పెనుగాలులు ఉయ్యూరు మండల పరిధిగ్రామాల్లో అరటి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. శనివారం రాత్రి పెనుగాలులు వీచి, భారీవర్షం కురవడంతో పెదఓగిరాల, గండిగుంట, ఆకునూరు గ్రామాల పరిధిలో వాణిజ్య పంటలు నేలవాలాయి. నష్టం వాటిల్లింది. మొక్క జొన్న కండిలు ముదురుతున్న తరుణం, అరటి చెట్లు గెలలు వేస్తున్న సమయంలో గాలులకు నేలకొరిగి నష్టం కలిగించింది. పండించిన పంట చేతి కొస్తున్న తరుణంలో వర్షం, గాలి దెబ్బతీసిందని, ప్రకతి వైపరీత్యాలు రైతులను కోలుకో కుండా చేస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు.
అధికారుల పరిశీలన
గండిగుంట గ్రామ పరిధిలో నెలకొరిగిన మొక్కజొన్న పంటను గన్నవరం వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సునీల్, మండల వ్యవసాయ అధికారి నిస్సీ గ్రేస్ ఆదివారం పరి శీలించారు. గాలులు, వర్షాలకు దెబ్బతిన్నపంటను లెక్క కట్టి ప్రభుత్వానికి నివేదిక అం దజేస్తామని పేర్కొన్నారు.అలాగే విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారిని అనుకుని మండల పరిధి గ్రామాల్లో ఉన్న సర్వీసు రోడ్లపై వర్షపు నీరు నిలిచి చెరువులను తలపిస్తున్నాయి. ఆకునూరు, గం డిగుంట, ఉయ్యూరు, మంటాడ, తాడంకి గ్రామాల సమీపాన జాతీయహదారులపై అ ండర్ పాస్ల వద్ద, సర్వీసురోడ్లపై కొద్దిపాటి వర్షానికి సైతం నీరు నిలిచింది.










