ప్రజాశక్తి - బుక్కరాయసముద్రం : ఇటీవల కురిసిన అకాల వర్షాలకు, ఈదురుగాలులకు నష్టపోయిన వ్యవసాయ, ఉద్యాన పంటల రైతులను ఆదుకుంటామని రాష్ట్ర ఉద్యానవన కమిషనర్ ఎస్‌ఎస్. శ్రీధర్ పేర్కొన్నారు. వర్షానికి నష్టపోయిన పంటల పరిశీలనలో భాగంగా రాష్ట్ర ఉద్యాన శాఖ కమిషనర్ ఎస్‌ఎస్. శ్రీధర్ అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం గ్రామంలోని పంట పొలాలను ఆదివారం పరిశీలించారు. గ్రామానికి చెందిన రైతు జనార్ధన్ సాగు చేసిన కాకరపంట వర్షానికి, ఈదురుగాలులకు దెబ్బతింది. ఈ నేపథ్యంలో ఈ పంటపొలాన్ని ఉద్యానవన కమిషనర్ పరిశీలించారు. బాధిత రైతుతో మాట్లాడారు. పంటసాగు, పెట్టుబడి, పంట కోత వివరాలు అడిగి తెలుసుకున్నారు. తీగజాతి పంటలను రాళ్లపందిరి ద్వారా సాగు చేస్తే ఇలాంటి అకాల వర్షాలకు నష్టం వాటిల్లకుండా ఉంటుందని సూచించారు. అలాగే రైతు రాజశేఖర్ సాగు చేస్తున్న కొత్తరకం విఎన్‌ఆర్ జామ తోటను పరిశీలించిన అధికారులు మార్కెటింగ్‌కి అనుకూలమైన విషయాలు, తెగుళ్ల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు.ఈసందర్బంగా ఉద్యాన శాఖ మండల అధికారి శైలజ మండలంలోని సాగుచేసిన పంట వివరాలను కమిషనర్‌కు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్పెషల్ ఇన్‌ఛార్జి, గుంటూరు కార్యాలయ డిడిహెచ్ ధర్మజ, జిల్లా ఉద్యానవన శాఖ ఇన్‌ఛార్జి నరసింహరావు, ఎపిఎంఐపి పీడీ ఫిరోజ్, సత్యసాయి జిల్లా ఉద్యానవన శాఖ అధికారి చంద్రశేఖర్, రైతుభరోసా కేంద్రం సిబ్బంది, రైతులు పాల్గొన్నారు,










