ప్రజాశక్తి-సీతంపేట : మణిపూర్ రాష్ట్రంలో ఇటీవల గిరిజనులపై జరిగిన దాడులను ఖండిస్తూ గిరిజన సంఘాలు, ఆదివాసీ జెఎసి ఆధ్వర్యంలో సోమవారం ఐటిడిఎ వద్ద నిరసన చేపట్టారు. ముందుగా సీతంపేట హైస్కూల్ వద్దకు గిరిజనులు భారీగా తరలివచ్చారు. అక్కడి నుండి ఐటిడిఎ వరకు శాంతియుత ర్యాలీ చేపట్టారు. మణిపూర్‌లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులపై దాడులు జరుగుతున్నాయని జెఎసి నాయకులు ఆవేదన వ్యక్తంచేశారు. సీతంపేటలో కోర్టు తీర్పు ఇచ్చిన 29 ఎల్‌టిఆర్ కేసులు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీతంపేట ఐదో షెడ్యూల్లో ఎల్‌టిఆర్, 1/70, పీసా చట్టాలు పగడ్బందీగా అమలు చేయాలని కోరారు. గిరిజన ఉపాధ్యాయురాలిని కులం పేరుతో దూషించిన లోకేష్‌పై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం పిఒ కల్పనకుమారికి వినతి పత్రం అందజేశారు. ధర్నాలో గిరిజన సంఘాలు, ఆదివాసీ జెఎసి నాయకులు బి.శ్రీనివాసరావు, నిమ్మక కాంతారావు, హెచ్.మోహనరావు, హెచ్.ప్రసాదరావు, బి.ఉమామహేశ్వరరావు, ఎం.రామారావు, రవి, కె.భాస్కరరావు, కె.అజరు కుమార్, కె.కాంతారావు తదితరులు పాల్గొన్నారు.










