Nov 06,2023 21:13

పిఒకు వినతినిస్తున్న కొల్లి సాంబమూర్తి

ప్రజాశక్తి -పార్వతీపురం : వెలుగు ఎపిడి వై.సత్యంనాయుడు పనిచేసిన కాలంలో ఐటిడిఎలో జరిగిన లావాదేవీ లపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని గ్రీవెన్స్‌లో ఐటిడిఎ పిఒ విష్ణుచరణ్‌కు సిపిఎం నాయకులు కె.సాంబమూర్తి, తెలుగుయువత మండల అధ్యక్షులు ఎన్‌.శ్రీనివాసరావు వినతిని అందజేశారు. ఈ సందర్భంగా సాంబమూర్తి మాట్లాడుతూ పార్వతీ పురం ఐటిడిఎ పరిధిలో గల కురుపాం, గుమ్మలక్ష్మీ పురం, మక్కువ, సాలూరు, పార్వతీపురం, పాచిపెం ట, జియ్యమ్మవలస, కొమరాడ మండలాల్లో వన్‌ దన్‌ వికాస్‌ కేంద్రాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.3.20కోట్లు ఎన్ని కేంద్రాలకు ఇచ్చారన్నారు. మిగతావి ఏమయ్యాయి, సుమారు ఎంత ఖర్చు పెట్టారు, ఇంకా ఎంత ఖర్చు పెట్టలేదనే వివరాలు, ఖర్చుపెట్టని డబ్బులు ఏమయ్యాయి అన్న విషయంపై దర్యాప్తు చేపట్టాలని కోరామన్నారు. మినప గుళ్ళు, అగర్బత్తి ఏ మండలాల్లో ఎన్ని వన్‌దన్‌ వికాస్‌ కేంద్రాలకు పంపిణీ చేశారని ప్రశ్నించారు. జీడి పిక్కలు ప్రాసెసింగ్‌ మిషన్లు సుమారు 13 వరకు కొనుగోలు చేసినట్లు తెలిసిందని, అయితే వాటివల్ల ఎలాంటి ప్రయోజనం లేకుండా కార్యాలయాలకు పరిమితమయ్యాయని చెప్పారు. వీటిన్నింటిపై దర్యాప్తు చేపట్టాలన్నారు.