ప్రజాశక్తి - ఆదోని
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ, విద్యుత్ పోరాటంలో అమరుడైన సత్తనపల్లి రామకృష్ణ ఆశయ సాధనకు కృషి చేద్దామని ఎపి రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షులు ముక్కన్న, ఉద్యోగ సంఘం నాయకులు నాగరాజు, సిద్ధప్ప కోరారు. ఆదివారం పట్టణంలోని మరాఠ గేరిలో మడివల్ల మాచయ్య స్వామి దేవాలయంలో రామన్న అధ్యక్షతన వర్థంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రజల స్వేచ్ఛ, స్వాతంత్య్రం, వెట్టి చాకిరి విముక్తి కోసం, భూమి కోసం, సాయుధ రైతాంగ పోరాటంలో తన వంతు పాత్ర పోషించిన వీర వనిత చాకలి ఐలమ్మను ఈతరం యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. సత్తెనపల్లి రామకృష్ణ భూమి కోసం, భుక్తి కోసం, నిజాం నవాబులకు వ్యతిరేకంగా పోరాడారని తెలిపారు. 2000 సంవత్సరం ఆగస్టు 28న విద్యుత్ చార్జీలకు నిరసనగా ఉమ్మడి రాజధాని హైదరాబాద్ బషీర్‌బాగ్‌లో జరిగిన కాల్పుల్లో గాయపడి సెప్టెంబర్ 8న సత్తనపల్లి రామకృష్ణ మృతి చెందారని చెప్పారు. రజక సంఘం పట్టణ అధ్యక్షులు ఈరన్న, నాయకులు ఉరుకుందు, నాగేష్, వెంకటేశులు, మల్లప్ప, ఉద్యోగ సంఘం నాయకులు గోవిందప్ప, నరసింహ రాజు, రజక సంఘం పట్టణ నాయకులు, నాగరాజు, ఎర్ర స్వామి, వెంకటేశ్వర్లు, నాగేష్ పాల్గొన్నారు.
నివాళులర్పిస్తున్న నాయకులు










