ఐక్యతతోనే బిసిలకు రాజ్యాధికారం
రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య : ఘనంగా బహుజన సాహిత్య అకాడమీ అవార్డుల ప్రధానం
ప్రజాశక్తి-ఉయ్యూరు
వెనుకబడిన తరగతులు (బిసి)లు ఐక్యంగా ఉండటం ద్వారా జాతీయ, రాష్ట్రాల్లోనూ ప్రత్యామ్నాయ రాజకీయశక్తిగా ఎదుగవచ్చునని రాజ్యసభ సభ్యులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య అభిప్రాయపడ్డారు. భారత రత్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా, ప్రపంచ జ్ఞాన దినోత్సవాన్ని పురస్కరించుకుని బహుజన సాహిత్య అకాడమీ (బిఎస్‌ఎ) జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణమూర్తి నేతృత్వంలో, బిఎస్‌ఎ రాష్ట్ర అధ్యక్షులు జంపాన శ్రీనివాసగౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఉయ్యూరు పట్టణంలో బహుజన సాహిత్య అకాడమీ 3వ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాన్ఫరెన్స్, అవార్డుల (2023) ప్రధాన కార్యక్రమం శుక్రవారం సాయంత్రం 5 గంటలకు స్థానిక బైపాస్ రోడ్ లోని అయ్యప్ప స్వామి గుడి సమీపంలోని గ్రీన్ ల్యాండ్ రిసార్ట్స్ ఆవరణలో సర్దార్ గౌతు లచ్చన్న సభా ప్రాంగణంలో ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో బిసిలు మరింతగా ఎదగాలని ఆకాంక్షించారు. తద్వారానే బిసిలకు మరింత ఉన్నత స్థానాల్లోకి వెళ్లటానికి అవకాశం ఉంటుందన్నారు. బిసిలకు రిజర్వేషన్లు మరింతగా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మరింతగా రాణించటానికి ప్రభుత్వాలు పథకాలు ప్రవేశపెట్టాలని కోరారు. సిఎం వైఎస్ జగన్మోహనరెడ్డి బిసిల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని వివరించారు. కృష్ణాపరిషత్ ఛైర్‌పర్సన్ ఉప్పాల హారిక, పామర్రు శాసనసభ్యులు కైలే అనిల్‌కుమార్ మాట్లాడుతూ సిఎం వైఎస్ జగన్మోహనరెడ్డి బిసిల పక్షపాతిగా పనిచేస్తున్నారన్నారు. బహుజన సాహిత్య అకాడమీ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ మాట్లాడుతూ సమాజంలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారిని గుర్తించి వారికి అవార్డులు ఇస్తున్నామన్నారు. తద్వారా వారు మరింతగా ఆయా రంగాల్లో రాణించటానికి అవకాశం ఉంటుందన్నారు. బీసీ సంక్షేమ సేన రాష్ట్ర అధ్యక్షులు శొంఠి రాజు, బహుజన సాహిత్య అకాడమీ రాష్ట్ర అధ్యక్షులు జంపాన శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బిసిలు ఐక్యంగా ఉంటే మరింతగా హక్కులు సాధించుకోగలమన్నారు. ఉత్తమ సంఘ సేవకులు గురజాడ వెంకటేశ్వరరావు, ఉత్తమ ప్రజా సేవకులు రాజులపాటి రామచంద్రరావు, ఉత్తమ పాత్రికేయులుగా దాసరి ఆళ్వారుస్వామి, కె.సాల్మన్‌రాజు, వడ్డేశ్వరం నాగేశ్వరరావు, ఉత్తమ యోగాచార్యగా దావులూరి రాధాకృష్ణమూర్తి, ఆయుర్వేద వైద్యరత్నగా డాక్టర్ దీవి చిన్మయలకు అవార్డులను అతిథులు అందజేశారు. జంపాన రఘుబాబు, ప్రకాష్, డాక్టర్ పూర్ణిమ, కె.శివనాగేంద్రం తదితరులు పాల్గొన్నారు.










