ప్రజాశక్తి-దర్శి: ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ ఐక్యంగా ఉండి విజయపథంలో నడవాలని మాజీ ఐఏఎస్ అధికారి డీఆర్‌వీఎస్ విజరుకుమార్ అన్నారు. స్థానిక గడియారస్తంభం సెంటర్‌లో సోమవారం ఐక్యత విజయపథం బహిరంగసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఐక్యతగా పనిచేసి రాబోయే ఎన్నికల్లో పేదల పక్షాన అందరం ముందు కు కదిలి అధికారాన్ని సాధించాలని ఆయన అన్నారు. అధికారం వస్తేనే మనకు అభివృద్ధి జరుగుతుందన్నారు. అధికారం లేకుండా ఏమీ చేయలేమన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని, అందరు కృషి చేసి గెలిపించాలని కోరారు. ప్రస్తుత సమాజంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అణగదొక్కుతున్నారని, భవిష్యత్తులో ఐక్యతతో పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దేవకుమార్, అచ్చయ్య, పోలయ్య, ప్రేమ్ కుమార్, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.










