ప్రజాశక్తి - కొమరాడ: పాలకులు, అధికారులు వంతెన నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించి పనులు చేపట్టాలని పూర్ణపాడు లాబేషు వంతెన సాధన కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. సోమవారం ఐదో రోజు వంతెన సాధన కమిటీ ఆధ్వర్యంలో రిలే దీక్ష కొనసాగింపు చేపట్టారు. ఈ సందర్భంగా సాధన కమిటీ సభ్యులు శ్రీను, నూకరాజు మాట్లాడుతూ పాలకుల నిర్లక్ష్యంతో గిరిజనులకు దీర్ఘకాలంగా సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో నాగావళి నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో రాకపోకలకు ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారన్నారు. 2006లో వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసి నేటికీ పూర్తి కాకపోవడం చూస్తే గిరిజన పట్ల పాలకులకు, ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్ధమవుతుందని ఎద్దేవా చేశారు. తక్షణమే వంతెన నిర్మాణానికి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అలాగే మరో మూడు రోజులపాటు జరిగే దీక్షలను జయప్రదం చేయాలని కోరారు. అనంతరం స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద జరగనున్న మహాధర్నాను జయప్రదం చేయాలని కోరారు.










