ప్రజాశక్తి పాడేరు,అరకులోయ: ఆంధ్ర ఊటీగా పేరుగాంచిన అందాల అరకులోయ పద్మాపురం గార్డెన్స్ అంటే తెలియని, చూడని వారు ఉండరు. అందమైన పూల చెట్లు వివిధ రకాల పండ్ల చెట్లు, అందమైన పగోడాలు, ఉద్యానవన విహారానికి టారు ట్రైన్ తోపాటు పిల్లల కోసం పెద్దల కోసం ప్రత్యేకంగా ఆట వస్తువులు మరెన్నో అందమైన ఆకృతులతో అందంగా తీర్చబడిన పద్మాపురం గార్డెన్స్‌లో ఇప్పుడు ఉద్యాన విహారంతో పాటు పర్యాటకులు విడిది చేసేందుకు ''ట్రీ కాసిల్'' పేరుతో ఆరు కాటేజీలను ఐటిడిఏ అందుబాటులోకి తెచ్చింది. గతంలో ఈ పద్మాపురం గార్డెన్‌లో ట్రీ హాట్స్ ఉండేవి. ఇవి శిథిలం కావడంతో కొత్తగా ట్రీ కాసిల్ పేరుతో సుమారు 36 లక్షల వ్యయంతో ఆధునిక వసతులతో ఆరు కాటేజీలతోపాటు ఆరు పగోడాలను నిర్మించారు. ఈ నెల 2 నుంచి ఈ కాటేజీలు పర్యాటకులకు అందుబాటులోకి రానున్నాయి. పద్మాపురం గార్డెన్స్‌లో సుమారు నాలుగు ఎకరాల సువిశలమైన ప్రాంగణంలో ఈ ''ట్రీ కాసిల్ ''ను తీర్చిదిద్దారు. నేచురల్‌గా కనిపించే విధంగా రాళ్లతో వాటర్ ఫౌంటెన్‌తో పాటు కాటేజీలలో ఉండే పర్యాటకుల కోసం ఆరుబయట కూర్చుని పూల తోటల మధ్య ప్రకృతిని ఆస్వాదించేందుకు ప్రత్యేకంగా ఆరు పగోడాలను నిర్మించారు. విద్యుత్ దీపాలంకరణతో గార్డెన్ నవీకరించారు. కాటేజీల్లో బస చేసే వారి కోసం కాట్స్ ఫర్నిచర్ వంటి ఖరీదైన సౌకర్యాలు కల్పించారు. ఈ కాటేజీల్లో శుక్ర, శని, ఆదివారాల్లో ఉండేందుకు రూ.4వేల ధర, మిగిలిన రోజుల్లో 3500 ధర నిర్ణయించారు. ఇద్దరు పెద్దలు, ఇద్దరు పిల్లలతో ఒక కుటుంబం ఒక కాటేజీలో ఉండడానికి వీలు కల్పించారు. ఇక్కడ బస చేసే పర్యాటకుల కోసం గిరిటేజ్ క్యాంటీన్ పేరుతో ఒక రెస్టారెంట్ ను ఏర్పాటు చేశారు. అలాగే ట్రీ కాసిల్ లో ఉండే పర్యాటకులకు గార్డెన్, ట్రైబల్ మ్యూజియం ప్రవేశ రుసుము, రెస్టారెంట్లో బ్రేక్ ఫాస్ట్ ఉచితం కల్పించారు. ఈ రెస్టారెంట్లో గిరిజన వంటకాలు లభించడం మరొక ప్రత్యేకం! అలాగే ఈ ప్రాంగణంలో వన్ దన్ వికాస్ కేంద్రం పేరుతో కాఫీ, రాజ్మా, తేనే తదితర గిరిజన ఉత్పత్తులు లభించే షాపును పర్యాటకుల సౌలభ్యం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. పద్మాపురంలో నూతనంగా నెలకొల్పిన ఈ ట్రీ కాసిల్ అరకు పర్యాటకానికి అదనపు ఆకర్షణ కానుంది.
జలపాతంలో సౌకర్యాలు మెరుగు.
పాడేరుకు సమీపంలోని జిమాడుగుల మండలంలో కొత్తపల్లి జలపాతం పర్యాటకులను అమితంగా ఆకట్టు కుని ఎంతో ప్రాచుర్యం పొందింది. ఐటిడిఏ గతంలో ఇక్కడ సుమారు కోటి రూపాయలు పైగా నిధులు వెచ్చించి అభివృద్ధి చేసింది. పర్యాటకుల విజ్ఞప్తి మేరకు తాజాగా మరో 10 లక్షల రూపాయల నిధులతో సౌకర్యాలు మెరుగు పరిచేందుకు పలు అభివృద్ధి పనులు ఐటీడీఏ నిర్వహిస్తోంది. ఈ జలపాతాన్ని పర్యాటకులు కింద వరకు వెళ్లి చూసేందుకు వీలుగా రేయిలింగ్ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టారు. పర్యాటకులకు సౌకర్యవంతంగా కొత్తపల్లి జలపాతాన్ని తీర్చిదిద్దు తున్నారు.
రూ 36 లక్షలతో 12 కాటేజీలు...
అరకులోయలోని కొత్తవలస హెచ్‌ఎంటిసి ఫారం లో పర్యాటకుల విడిది కోసం 36 లక్షల వ్యయంతో ఆధునిక సౌకర్యాలతో 12 కాటేజీలను ఐటిడిఏ నిర్మిస్తోంది. రోజుకు ఒక కాటేజీకి 2000 రూపాయలు చొప్పున అద్దె నిర్ణయించి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొస్తుంది. అరకు సమీపంలోని కొల్లా పుట్ లో పర్యాటకుల కోసం నిర్మించిన 12 కాటేజీలు పర్యాటకులకు ఎంతో ఆకర్షణీయంగా సౌలభ్యంగా ఉన్నాయి. గిరి గ్రామదర్శిని పేరుతో పెదలబుడు లో నిర్మించిన 14 కాటేజీలు పర్యాటకులకు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఆధునిక సౌకర్యాలతో పాటు ఆహ్లాదాతన్ని అందించే విధంగా కొండల నడుమ కాటేజీలను అందంగా తీర్చిదిద్దారు. పాడేరు ఏజెన్సీలో ఐటీడీఏ ద్వారా జరుగుతున్న పర్యాటకాభివృద్ధి ప్రాజెక్ట్ అధికారులు పర్యవేక్షణలో ఒక ప్రత్యేక శైలిని విశిష్టతని ఏర్పరచుకున్నాయి.










