ప్రజాశక్తి - పార్వతీపురం టౌన్ : అందుబాటు ధరకే సాధారణ ప్రజలకు భోజనాలు సమకూర్చేందుకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా), పురపాలక సంఘం ఆధ్వర్యంలో గురువారం స్థానిక బెలగాం చర్చి సెంటర్లో కొత్తగా ఏర్పాటు చేసిన ఆహా క్యాంటీన్‌ను స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు ప్రారంభంచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మహిళల అభ్యున్నతికి, ఆర్థిక స్వావలంబనకు పెద్దపీట వేస్తూ ప్రతి మహిళను లక్షాధికారిగా చేసేందుకు గాను ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందన్నారు. అందులో భాగంగా వైయస్సార్ ఆసరా, చేయూత ఆర్థిక సహాయంతో మహిళలు స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపర్చుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో మున్సిపాల్టీ పరిధిలో గల మహిళా సంఘాలచే ఆహా క్యాంటీన్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అతి తక్కువ ధరకే ప్రజలకు భోజనాలు అందచేసి అటు ప్రజలకు ఇటు మహిళా సంఘం సభ్యులకు ఎంతగానో ఉపయోగపడేలా ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు తెలిపారు. అనంతరం ర్యాలీ సందర్భంగా ఎమ్మెల్యేకు పలువురు మహిళలు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ బోను గౌరీశ్వరి, వైస్‌చైర్మన్లు కొండపల్లి రుక్మిణి, యిండుపూరు గున్నేశ్వరరావు, వివిధ వార్డుల కౌన్సిలర్లు, మెప్మా సంఘం సభ్యులు, అధికారులు, ఆర్పీలు, వైసిపి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు..










