చెన్నైలోని స్వగృహంలో స్వామినాథన్ కన్నుమూత
పలువురు ప్రముఖుల సంతాపం
చెన్నై : హరిత విప్లవ పితామహుడు, ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త, జన్యు శాస్త్ర నిపుణుడు ఎంఎస్. స్వామినాథన్ (98) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం 11.20 గంటలకు చెన్నైలోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ఆహార రంగంలో దేశం స్వయం సమృద్ధి సాధించేందుకు, ఆకలిని, పేదరికాన్ని పారద్రోలేందుకు ఆయన ఎన్నో పరిశోధనలు చేశారు. అధిక దిగుబడిని అందించే వరి, గోధుమ వంగడాలను అందించి దేశానికి ఎంతో మేలు చేకూర్చారు. స్వామినాథన్‌కు ముగ్గురు కుమార్తెలు..సౌమ్య, మధుర, నిత్య...ఉన్నారు. ఆయన భార్య, విద్యావేత్త మీనా స్వామినాథన్ గత సంవత్సరమే కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు శనివారం నిర్వహించనున్నట్లు ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఎంఎస్‌ఆర్‌ఎఫ్) అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఎంఎస్ భౌతికకాయాన్ని శుక్రవారం నాడు ప్రజాసందర్శనార్థం ఎంఎస్‌ఆర్‌ఎఫ్‌కు తరలిస్తారు. స్వామినాథన్ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ప్రకటించారు. హరిత విప్లవ పితామహుని మృతి పట్ల యావత్ దేశం విచారం వ్యక్తం చేసింది. స్వామినాథన్ మరణం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్, కేరళ సిఎం పినరయి విజయన్, ఆంధ్రప్రదేశ్ గరవ్నరు అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సహా వివిధ రాజకీయ, వ్యవసాయ రంగ ప్రముఖులు, ప్రభుత్వాధినేతలు, అఖిల భారత కిసాన్ సభ, వ్యవసాయ కార్మిక సంఘం సహా అనేక ప్రజా సంఘాల నాయకులు సంతాపం ప్రకటించారు. స్వామినాథన్ సేవలను కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
కరువు కాటకాలకు చలించి..వైద్య విద్యకు స్వస్తి చెప్పి..సేద్యానికి ఊపిరినిచ్చి..
స్వామినాథన్ 1925 ఆగస్ట్ 7న తమిళనాడులోని కుంభకోణంలో జన్మించారు. ప్రాథమిక విద్య, మెట్రిక్యులేషన్‌ను అక్కడే పూర్తి చేశారు. తండ్రి వైద్యుడు కావడంతో ఆయన కూడా వైద్య విద్యలోనే ప్రవేశించారు. అయితే 1943లో బెంగాల్‌లో సంభవించిన కరవు కాటకాలను చూసి చలించిపోయి వైద్య విద్యకు స్వస్తి చెప్పి, వ్యవసాయ రంగం వైపు అడుగులు వేశారు. త్రివేండ్రంలోని మహారాజా కళాశాలలో జువాలజీ కోర్సులో చేరి అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత మద్రాసు వ్యవసాయ కళాశాలలో చేరి డిగ్రీ చదివారు. 1949లో ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ నుండి సైటో జెనెటిక్స్‌లో పీజీ చేశారు. ఆ తర్వాత నెదర్లాండ్స్ వెళ్లి అక్కడి వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బంగాళదుంపల జన్యువులపై పరిశోధనలు చేశారు. 1950లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన ప్లాంట్ బ్రీడింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి పీహెచ్‌డీ చేశారు. అంతేకాదు...విస్కాన్సిన్ వర్సిటీలోని జెనెటిక్స్ విభాగంలో పోస్ట్ డాక్టరల్ పరిశోధన చేశారు. 1954లో స్వదేశానికి తిరిగి వచ్చి భారత వ్యవసాయ పరిశోధనా సంస్థలో శాస్త్రవేత్తగా చేరారు. వ్యవసాయ పరిశోధనలకు సంబంధించి పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు ఆయన నేతృత్వం వహించారు. వాటి ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థలో జెనెటిక్స్ విభాగాన్ని, అణు పరిశోధనా ప్రయోగశాలను ఆయనే ఏర్పాటు చేశారు. ఫిలిప్పీన్స్‌లో అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ అధిపతిగా పనిచేశారు. దేశంలోని ఉష్ణ మండల ప్రాంతాల కోసం అంతర్జాతీయ పంటల పరిశోధనా కేంద్రం ఏర్పాటులో భాగస్వామి అయ్యారు. ఇటలీలో మొక్కల జన్యు వనరులకు సంబంధించి అంతర్జాతీయ బోర్డు ఏర్పాటులో, కెన్యాలో వ్యవసాయ-అటవీ భూములకు సంబంధించి అంతర్జాతీయ పరిశోధనా మండలి ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు.
వరి, గోధుమ పంటలపై ఆయన చేసిన పరిశోధనల కారణంగా దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. తద్వారా దేశం హరిత విప్లవాన్ని సాధించింది. స్వామినాథన్ ఎన్నో పదవులను చేపట్టి వాటికి వన్నె తెచ్చారు. మరెన్నో పురస్కారాలు ఆయన్ని వరించాయి. 1972-1979 మధ్యకాలంలో భారత వ్యవసాయ పరిశోధనా మండలి డైరెక్టర్ జనరల్‌గా, 1979-1980లో కేంద్ర వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శిగా, 1982-1988 మధ్య అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ డైరెక్టర్ జనరల్‌గా పనిచేశారు. 2019-22 మధ్యకాలంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేశారు. 20వ దశాబ్దంలో ఆసియా ప్రజలను అధికంగా ప్రభావితం చేసిన వారితో టైమ్స్ పత్రిక రూపొందించిన జాబితాలో స్వామినాథన్ పేరును చేర్చారు. స్వామినాథన్ 1987లో చెన్నైలో తన పేరిట రిసెర్చ్ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశారు.
అవార్డుల పరంపర
హరిత విప్లవ మార్గదర్శకుడు ఎంఎస్ స్వామినాథన్ సేవలకు గుర్తింపుగా ఆయనను అనేక అవార్డులు వరించాయి. 1967లో పద్మశ్రీ, 1972లో పద్మభూషణ్, 1989లో పద్మవిభూషణ్ అవార్డులు పొందారు. 1971లో రామన్ మెగసెసే అవార్డును, 1986లో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ప్రపంచ సైన్స్ అవార్డును అందుకున్నారు. 1987లో వ్యవసాయ పరిశోధనలో అత్యున్నత పురస్కారం ప్రపంచ ఫుడ్ అవార్డు ఆయనను వరించింది. 1989లో ఇందిరాగాంధీ శాంతి బహుమతి, 2013లో ఇందిరాగాంధీ సమైక్యతా పురస్కారం లభించాయి.
- దేశ వ్యవసాయ రంగం పెద్ద దిక్కును కోల్పోయింది: కేసీఆర్
హైదరాబాద్: భారత హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, పలువురు మంత్రులు సంతాపం తెలిపారు. దేశ వ్యవసాయ రంగం పెద్ద దిక్కును కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ వ్యవసాయ రంగంలో స్వామినాథన్ వినూత్న పద్ధతులు చేర్చారని కొనియాడారు. ఆయన కృషి వల్లే ఆహార ఉత్పత్తిలో భారత్ స్వయం సమఅద్ధి సాధించిందన్నారు. రైతుల గుండెల్లో స్వామినాథన్ చిరస్థాయిగా నిలిచిపోతారని కేసీఆర్ తెలిపారు.
- ఆయన చేసిన కృషి మర్చిపోలేనిది- ఏపీ సీఎం జగన్
''వ్యవసాయ రంగంలో వినూత్న మార్పులు తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతాల రూపురేఖలను సమూలంగా మార్చిన గొప్ప వ్యక్తి స్వామినాథన్. ఆయన చేసిన కృషి మర్చిపోలేనిది. వ్యవసాయ రంగం, దేశాన్ని ఆహార ఉత్పత్తిలో స్వయం సమఅద్ధి సాధించేలా చేశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను సుసంపన్నం చేన గొప్ప వ్యక్తి''
- స్వామినాథన్ మృతి వ్యవసాయ రంగానికి తీరని లోటు : - మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
''స్వామినాథన్ మృతి వ్యవసాయ రంగానికి తీరని లోటు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ అభివఅద్ధిని స్వామినాథన్ ప్రశంసించారు. అన్నదాత ఆత్మబంధువు స్వామినాథన్. ఆయన కృషి వల్లే దేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తి పెరిగింది''
- స్వామినాథన్ మృతి బాధాకరం- టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్
''స్వామినాథన్ మృతి బాధాకరం. వ్యవసాయ రంగంలో ఆయన విప్లవాత్మక మార్పులు తెచ్చారు. ఆయన మఅతి యావత్ రైతు లోకానికి తీరని లోటు. నిరంతరం రైతు సంక్షేమం కోసం ఆయన ఎంతో పరితపించారు''
- ''దేశ ప్రజల ఆహార కొరతను స్వామినాథన్ తీర్చారు- మంత్రి హరీశ్‌రావు
''దేశ ప్రజల ఆహార కొరతను స్వామినాథన్ తీర్చారు. ఆయన మృతి వ్యవసాయ రంగానికి తీరని లోటు. జీవితాంతం వ్యవసాయ అభివృద్ధి గురించే ఆలోచించారు. స్వామినాథన్ భవిష్యత్తు తరాలకు స్ఫూర్తి''










