మొక్కజొన్న సీడ్స్ సాగులో కంపెనీల ఇష్టారాజ్యం
ప్రతియేటా నష్టాలతో రైతుల ఆత్మహత్యలు
నష్ట పరిహారం ఇవ్వకుండా సీడ్స్ కంపెనీల నిర్లక్ష్యం
తామేమీ చేయలేమంటున్న వ్యవసాయాధికారులు
ఈ ఏడాదైనా రైతులకు మేలు జరిగేలా చర్యలుండేనా?
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి : మొక్కజొన్న సీడ్స్ కంపెనీలు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లు సాగుతోంది. రైతులను నిలువునా మోసగిస్తున్నా అడిగే నాథుడే లేకుండాపోయాడు. తమకు ఏమాత్రం సంబంధం లేదన్నట్లు వ్యవసాయాధికారులు వ్యవహరిస్తున్నారు. దీంతో నాణ్యత లేని సీడ్స్‌తో నష్టపోయిన రైతులు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు జిల్లాలో నిత్యకృత్యంగా మారుతున్నాయి. ఈ నెలాఖరు నుంచి మొక్కజొన్న సాగు ప్రారంభం కానుంది. గతంలో మాదిరిగా కాకుండా సీడ్స్ సాగు చేస్తున్న రైతులకు నష్టం వాటిల్లితే కంపెనీలు పరిహారం ఇచ్చేలా సంస్థలు అగ్రిమెంట్లు చేసేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. సీడ్స్ కంపెనీలపై ప్రభుత్వ పర్యవేక్షణ ఉండేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఏలూరు జిల్లాలో దాదాపు లక్ష ఎకరాల్లో మొక్కజొన్న సాగు సాగుతోంది. మొక్కజొన్న సాగులో సీడ్స్ సాగు, కమర్షియల్ సాగు అనే రెండు రకాల పద్ధతుల్లో రైతులు సాగు చేస్తారు. ఏలూరు జిల్లాలో 70 వేల ఎకరాల్లో కంపెనీల మొక్కజొన్న సీడ్స్‌ను రైతులు సాగు చేస్తున్నారు. మొక్కొజొన్న సీడ్స్ సాగులో విత్తన కంపెనీల ప్రతినిధులే రైతుల వద్దకు వెళ్లి తమ సీడ్స్ సాగు చేయాలని ఇస్తారు. దిగుబడి ఎంత వస్తుంది, ఏయే రకాల సస్యరక్షణ చర్యలు తీసుకోవాలో కూడా కంపెనీల ప్రతినిధులే రైతులకు వివరిస్తారు. పండిన పంటను రైతుల నుంచి కంపెనీలే కొనుగోలు చేస్తాయి. కమర్షియల్ సాగులో మాత్రం రైతులు విత్తనం కొనుగోలు చేసుకుని సాగు చేస్తారు. కమర్షియల్ పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. సీడ్స్ సాగులోనే రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. కంపెనీల్లో తమ సీడ్స్‌ను ట్రయల్ పద్దతిలో రైతులకు అందించి సాగు చేయిస్తున్నారు. దిగుబడి వస్తే తమ సీడ్స్ గొప్ప అన్నట్లు చెబుతున్నారు. దిగుబడి రాకపోతే మాత్రం రైతులదే తప్పన్నట్లు మాట్లాడి గాలికొదిలేస్తున్నారు. దీంతో తీవ్రంగా నష్టపోతున్న రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నూజివీడు నియోజకవర్గంలో ఇదేవిధంగా గతేడాది రైతు ఆత్మహత్యలు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడం వల్లే సీడ్స్ కంపెనీలు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాయనే విమర్శలు విన్పిస్తున్నాయి.
అగ్రిమెంట్ నిబంధనలు అమలు చేయరా..!
సీడ్స్ కంపెనీలు తమ విత్తనాన్ని రైతులకు అందించేటప్పుడు నిబంధనల ప్రకారం అగ్రిమెంట్లు రాయాల్సి ఉంటుంది. అగ్రిమెంట్‌లో సీడ్స్ విత్తనంతో నష్టం వాటిల్లితే రైతులకు నష్టపరిహారం ఇచ్చేలా పొందుపర్చాల్సి ఉంది. అయితే జిల్లాలో ఎక్కడా అగ్రిమెంట్ల నిబంధన అమలు కావడం లేదు. అధికారులు సైతం పట్టించుకోవడం లేదు. దాదాపు దశాబ్దకాలంగా రైతులు పోరాటం చేస్తున్నా పట్టించుకోవడం లేదు. అగ్రిమెంట్ లేకపోవడంతో సీడ్స్ పంట దెబ్బతింటే రైతులకు కంపెనీలు ఎటువంటి నష్టపరిహారమూ ఇవ్వడం లేదు. దీంతో రైతు పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. నాణ్యమైన సీడ్స్ ఇవ్వని కంపెనీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. దీంతో సీడ్స్ కంపెనీలు మరింత రెచ్చిపోతున్నాయి. ఈ ఏడాదైనా అగ్రిమెంట్లు రాసేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ప్రతి గ్రామంలోనూ రైతుభరోసా కేంద్రాలు ఉన్నాయి. రైతుభరోసా కేంద్రాల్లో పని చేసే అధికారుల పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకుంటే మొక్కజొన్న రైతులకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. సమగ్ర విత్తన చట్టం లేకపోవడం కారణంగా విత్తన సంస్థలు ఈ విధంగా రెచ్చిపోతున్నాయంటూ రైతులు గగ్గోలు పెడుతున్నారు. జిల్లా అధికారులు మొక్కజొన్న రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటారో.. లేదో వేచిచూడాలి.










