Apr 28,2023 08:10

జయమంగళి నది నుంచి టిప్పర్ల ద్వారా తరలిపోతున్న ఇసుక

         పరిగి : పరిగి మండల కేంద్రంలోని జయమంగలి నది ప్రాంతంలోని రీచ్‌ నుంచి ఇసుక అక్రమ తరలింపు యథేచ్ఛగా కొసాగుతోంది. ఇసుక తరలింపునకు అనుమతి తీసుకున్న యాజమాన్యానికి కోటా పూర్తయినా ఇసుక దోపిడీని మాత్రం ఆపడం లేదు. అధికారుల ఆదేశాలను సైతం పట్టించుకోకుండా సదరు యాజమాన్యం ఇసుకను తరలించుకుపోతోంది. కళ్లేదుటే ఈ దోపిడీ జరుగుతున్నా అధికారులు చేష్టలుడిగి చూసే పరిస్థితి ఉండడం గమనార్హం.
పరిగి మండల కేంద్రంలోని జయమంగలి నది ప్రాంతంలో ఇసుక రీచ్‌ను ఇటీవల ఏర్పాటు చేశారు. గత మూడు రోజుల క్రితమే జెపి కన్‌స్ట్రక్షన్‌కు ఇచ్చిన అనుమతులతో పాటు అంచనా వేసిన 3.9 హెక్టర్ల పరిధి ఇసుకను తరలించారు. అనుమతి ఇచ్చిన ఇసుక తరలించడంతో మండల రెవెన్యూ అధికారులు ఇసుక తరలింపు నిలిపేయాలని యాజమాన్యానికి ఆదేశాలు ఇచ్చారు. దీనిని సదరు కన్‌స్ట్రక్షన్స్‌ యాజమాన్యం పెడచెవిన పెట్టినట్లు తెలుస్తోంది. తమకు ఇసుక డిమాండ్‌ ఎక్కువ ఉందని, నిలుపుదల చేయడం కుదరదని అధికారులను చెప్పినట్లు సమాచారం. అధికారుల ఆదేశాలను సైతం బేఖాతారు చేస్తూ జెపి కన్‌స్ట్రక్షన్స్‌ యథేచ్ఛగా రీచ్‌ నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తోంది. దీనిపై స్థానిక రైతులు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నోఏళ్ల తర్వాత భూగర్భ జలాలు పెరిగాయని ఆనందిస్తున్న తరుణంలో ఇలా నది నుంచి ఇసుక తరలిపోతే నీటికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని రైతులు చెబుతున్నారు. అధికార పార్టీ నాయకులు కొందరు జెపి కన్‌స్ట్రక్షన్స్‌తో కుమ్మక్కై ఇసుక అక్రమ తరలింపునకు సహకరిస్తున్నారనే ఆరోపణలు బలంగా విన్పిస్తున్నాయి. ఇప్పటికే ఇసుక అక్రమ రవాణాపై వామపక్ష పార్టీలతో పాటు ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. అయినా అధికార పార్టీ నేతల సాయంతో ఇసుక అక్రమ తరలింపు కొనసాగుతూనే ఉంది. ఇదిలానే కొనసాగితే తాగడానికి, వ్యవసాయానికి నీరు సమద్ధిగా దొరకక ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇసుక రీచ్‌ నిలుపుదల చేయాలని స్థానికులు కోరుతున్నారు.