ఇంఫాల్ : మణిపూర్ ప్రభుత్వం సాయుధ దళాల (ప్రత్యేక అధికారాల) చట్టం (ఎఎఫ్‌ఎస్‌పిఎ)ని ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. ఏడు జిల్లాల్లోని 19 పోలీస్ స్టేషన్లు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ ఈ చట్టం అక్టోబర్ 1 నుండి అమల్లోకి రానుందని తెలిపింది. ఇంఫాల్ మునిసిపాలిటీ ప్రాంతం మినహా మణిపూర్‌లో 2004 నుండి ఎఎఫ్‌ఎస్‌పిఎ చట్టం అమలులో ఉంది. 2022 ఏప్రిల్‌లో ఆరు జిల్లాల్లోని 15 పోలీస్ స్టేషన్లను ఈ చట్టాన్ని మినహాయించింది. అనంతరం మరో నాలుగు పోలీస్ స్టేషన్‌లను కలిపి ఏప్రిల్ 1 నుండి 'డిస్ట్రబ్డ్ ఏరియా' (అంతరాయం కలిగించే ప్రాంతాలు) నోటిఫికేషన్‌ను కూడా ఉపసంహరించుకుంది. దీంతో మణిపూర్‌లోని మొత్తం ఏడు జిల్లాల్లో 19 పోలీస్ స్టేషన్ ప్రాంతాలు ఎఎఫ్‌ఎస్‌పిఎ కింద మినహాయింపు పొందాయి. పోలీసులు, ఇతర ఏజన్సీస్ శాంతి భద్రతల పరిరక్షణలో ఉన్నందున క్షేత్రస్థాయిలో రాష్ట్ర పరిస్థితులను అంచనా వేయడం సాధ్యం కాదని .. దీంతో ఈ చట్టాన్ని పొడిగించినట్లు ఎన్. బీరేన్ సింగ్ ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నందున లోయ జిల్లాలను కూడా ఎఎఫ్‌ఎస్‌పిఎ పరిధిలోకి తీసుకురావాలని సైన్యం డిమాండ్ చేస్తోంది.










