ప్రజాశక్తి-ఆదోనిరూరల్
మండలంలోని బైచిగేరి, జాలమంచి, కపటి గ్రామాలతో పాటు పలు గ్రామాలకు వెళ్లే రోడ్లు అధ్వానంగా మారాయి. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లపై ఏర్పడిన గుంతల్లో నీరు చేరడంతో పాదచారులు, వాహనచోదకులు ఇబ్బంది పడుతున్నారు. బైచిగేరి నుంచి కపటి గ్రామానికి వెళ్లే రోడ్డు అధ్వానంగా మారిందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుప్పగల్ క్రాస్ నుంచి జాలమంచి గ్రామానికి వెళ్లే రోడ్డు పరిస్థితి మరింత దారుణంగా మారిందని పేర్కొంటున్నారు. గ్రామాలకు వెళ్లే రోడ్డు గుంతలమయం కావడంతో చీకటి పడిన తర్వాత ఈ మార్గంలో రాకపోకలు సాగించే వారు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు గుంతలమయం కావడంతో అతి కష్టమ్మీద రాకపోకలు సాగించాల్సి వస్తోంది. నిత్యం వందలాదిమంది ప్రయాణికులు పట్టణానికి, గ్రామాలకు, వివిధ ప్రాంతాలకు ఈ మార్గం గుండానే రాకపోకలు సాగిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి రోడ్లకు నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
గుంతలమయమైన గ్రామీణ రోడ్డు










