Jul 02,2023 21:33

గుంతలు పడిన రహదారి

ప్రజాశక్తి బత్తలపల్లి : మండలంలోని పలు గ్రామీణ రహదారులు అధ్వానంగా తయారయ్యాయి. ప్రధానంగా ఖత్తలపల్లి నుంచి ధర్మవరానికి వెళ్లే రహదారిపై తహశీల్దార్‌ కార్యాలయం సమీపంలో గుంతలు ప్రమాదాలకు నిలయంగా మారాయి. ఇక్కడ పలువురు ప్రమాదాలకు గురై ఆసుపత్రి పాలయ్యారు. అయినా ఆర్‌ అండ్‌ అధికారులు పట్టించుకోవడంలేదు. మండల అధికారులు అందరూ ఈ గుంతలు చూసుకుంటూ వెలుతున్నారే తప్ప ఎవరూ పట్టించుకోవడంలేదని పలువురు విమర్శిస్తున్నారు. శనివారం రాత్రి ద్విచక్రవాహనదారుడు ధర్మవరం వెలుతూ ఇక్కడ గుంతలు గమనించకపోవడంతో ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో అతనితల్లి గంగలక్ష్మీ తీవ్రంగా గాయపడి అనంతపురంలోని ప్రవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పరిస్థితి విషమంగానే ఉన్నట్లు సమాచారం. తహశీల్దార్‌ కార్యాలయం వద్దకు రాగానే గుంతలోకి ద్విచక్రవాహనాలు దిగాయంటే ప్రమాదానికి గురి కావాల్సిందే. పగలు అయితే గుంతలు గమనించి చాలా మంది తప్పించుకుంటూ వెళుతున్నారు. రాత్రి సమయాల్లో ఎదురుగా వస్తున్న వాహనాల లైటింగ్‌కు కనిపించకపోవడం, వేగంగా వస్తూ గమనించకపోవడంతో ప్రమాదాలకు గురవుతున్నారు. ఇప్పటికైనా ఆర్‌అండ్‌బి అధికారులు స్పందించి గుంతలకు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.