ప్రజాశక్తి - సాలూరు : జిల్లా వైద్యాధికారికి, జిల్లా డిసిహెచ్‌ఎస్‌కు బుద్ధి ఉందా లేదా? బుద్ధి ఉన్నవారెవరూ ఆరు సచివాలయాల పరిధిలో ఉన్న 2500మంది రోగులకు ఒక వైద్య శిబిరం నిర్వహించరు. గ్రామాల్లో సచివాలయానికో వైద్య శిబిరం నిర్వహిస్తూ బాగా సేవలందిస్తున్నారు, పట్టణాల్లో ఆరు సచివాలయాలకు ఒక చోట వైద్య శిబిరం నిర్వహిస్తారా? అంటూ డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర డిప్యూటీ డిఎంహెచ్‌ఒ డాక్టర్ శివకుమార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని డబ్బివీధి మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో వైద్య శిబిరం నిర్వహించారు. పట్టణంలో ఒక అర్బన్ హెల్త్ సెంటర్ పరిధిలో ఉన్న ఆరు సచివాలయాలకు ఇక్కడ వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజన్నదొర, మున్సిపల్ చైర్ పర్సన్ పువ్వుల ఈశ్వరమ్మ, వైస్ చైర్మన్లు జర్జాపు దీప్తి వంగపండు అప్పలనాయుడు, కమిషనర్ టి.జయరాం, డిప్యూటీ డిఎం హెచ్‌ఒ హాజరయ్యారు. ఆరు సచివాలయాల పరిధిలో ఉన్న రోగులు వేల సంఖ్యలో హాజరు కావడంతో పరిస్థితి గందరగోళంగా మారుతుందని భావించి అధికారులపై ఆయన తీవ్ర అసంతప్తి వ్యక్తం చేశారు. మిగిలిన 8 సచివాలయాల్లో రెండు, మూడు శిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం రాజన్నదొర మాట్లాడుతూ నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు తీసుకొని రావడానికే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. ఈ శిబిరాల్లో నమోదు వైద్య పరీక్షలు చేసుకున్న తర్వాత ఎంతటి పెద్ద రోగం బయటపడినా ప్రభుత్వం చికిత్సకి అయ్యే ఖర్చును భరిస్తుందని చెప్పారు. ప్రజలు ఈ వైద్య శిబిరాలను వినియోగించుకోవాలని కోరారు. అనంతరం ఐసిడిఎస్ ప్రాజెక్టు నిర్వహించిన పోషకాహారం స్టాల్ ని ఆయన పరిశీలించారు. అంగన్వాడీ కార్యకర్తలు ఆయనకు పిండివంటల రుచి చూపించారు. ఐసిడిఎస్ పిడి బి.సత్యవతి ఆధ్వర్యాన స్టాల్ ఏర్పాటు చేశారు.
ఇరుకు ప్రదేశంలో వైద్య శిబిరం
పట్టణంలోని ఒక అర్బన్ హెల్త్ సెంటర్ పరిధిలో ఉన్న ఆరు సచివాలయాలకు సంబంధించిన రోగులకు వార్డు వాలంటీర్ల ద్వారా అధికారులు టోకెన్లు జారీ చేశారు. పట్టణంలోని డబ్బివీధి మున్సిపల్ హైస్కూల్ మైదానం ఇరుకు ప్రదేశం కావడంతో హాజరైన రోగులతో కిటకిటలాడింది. ఎక్కువమంది అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధులు, మహిళలు హాజర య్యారు. 2500మందికి వైద్య సేవలందేలా చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. కేష్ సీట్లు మాత్రం సుమారు 1400మందికి జారీ చేసినట్లు తెలిపారు. గ్రామాల్లో ప్రతి సచివాలయానికి ఓ వైద్య శిబిరం నిర్వహిస్తుండడంతో వైద్య సేవలు సక్రమంగా అందుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పట్టణాల్లో ఒక అర్బన్ హెల్త్ సెంటర్ పరిధి ఉంటే ఆరు సచివాలయాలకు సంబంధించిన 12వార్డుల ప్రజలు వుంటారు. వీరందరికీ ఒకేచోట వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని జిల్లా వైద్యాధికారులు భావించడం అనాలోచిత నిర్ణయం. పట్టణాల్లో వైద్య శిబిరాల నిర్వహణ పై ప్రణాళికాబద్ధంగా అధికారులు వ్యవహరించకపోవడంతో హాజరైన రోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మున్సిపల్, వైద్య ఆరోగ్య శాఖ అధికారుల మధ్య సమన్వయలోపం స్పష్టం గా కనిపించింది. దీంతో కొంతమంది రోగులు నిరాశ తో వెనుదిరిగాల్సి వచ్చింది.
చిన్న పిల్లల వైద్యుల్లేక నిరాశ
ఇంత పెద్ద వైద్య శిబిరంలో చిన్న పిల్లల వైద్యుల్లేకపోవడంతో చాలా మంది తల్లులు నిరాశతో వెనుదిరిగారు. చిన్న పిల్లలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు చూసే వైద్యులు వస్తారని ప్రచారం చేయడంతో కొంతమంది బాలింతలు చంటిపిల్లల్ని తీసుకుని వచ్చారు. వీరికి సంబంధించిన వైద్యులు లేరని తెలియడంతో నిరాశ తో వెళ్లిపోయారు.










