ప్రజాశక్తి, కదిరి టౌన్ : మున్సిపల్ అధికారుల తీరుకు నిరసనగా వైసిపి నాయకులు సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. పట్టణంలోని పదో వార్డు కౌన్సిలర్ దిల్షా దున్నిసా, వైసిపి నాయకులు బాహుద్దీన్ వార్డు ప్రజలతో కలసి ఆందోళనకు దిగారు. ఈసందర్భంగా వైసిపి నాయకులు మాట్లాడుతూ మున్సిపల్ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచి గత ఎన్నికల్లో సిద్ధారెడ్డి గెలుపునకు కషి చేసిన సొంత పార్టీ కార్యకర్తల పైనే విషం కక్కుతున్నారని ఆ పార్టీ నాయకులు విషం కక్కుతున్నారన్నారు. ఎమ్మెల్యే తప్పులను ప్రశ్నిస్తే అధోగతే అని విమర్శించారు. ఇదిలా ఉండగా బాధ్యతగా విధులు నిర్వర్తిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేరుస్తున్న వాలంటర్లను అకారణంగా తొలగించడం అన్యాయమన్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పదో వార్డు కౌన్సిలర్ దిల్షా దున్నిసా తమ వార్డులో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమావేశంలో నేలపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారన్నారు. బాధ్యతగా విధులు నిర్వహిస్తున్న వాలంటర్లను రాజకీయ ప్రలోభాలకు గురై తొలగించడం సబబు కాదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. ఆ సమయంలో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన మునిసిపల్ శాఖ అధికారులు పట్టించుకోలేదన్నారు. దీంతో అధికారుల తీరుకు నిరసనగా మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించాల్సి వచ్చిందన్నారు. ప్రభుత్వ పథకాలను సక్రమంగా. ప్రజలకు చేరుస్తున్న వాలంటర్లను ఎందుకు తొలగించారో తెలపాలని డిమాండ్ చేశారు. జగనన్న ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారని పరోక్షంగా స్థానిక ప్రజా ప్రతినిధి పై ఆరోపణలు గుప్పించారు. సమస్యను పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. స్పందించిన మున్సిపల్ కమిషనర్ శ్రీహరిబాబు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించారు.ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.










