Sep 30,2023 20:36

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి బొత్స సత్యనారాయణ

ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్‌ :  రాబోయే ఎన్నికలలో 175కి గాను 175 సీట్లు సాధించి, అధికారమే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేసి, వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, జిల్లా వైసిపి ఎన్నికల బాధ్యలు బొత్స సత్యనారాయణ కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక లయన్స్‌ కల్యాణమండపంలో వైసిపి జిల్లా అధ్యక్షులు శతృచర్ల పరీక్షిత్తురాజు అధ్యక్షతన జరిగిన జిల్లాస్ధాయి నాయకుల విస్తృతస్థాయి సమావేశంలో ఉపముఖ్యమంత్రి పీడకరాజన్నదొరతో కలసి పాల్గొన్నారు. ముందుగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ గడపగడపకు మన ప్రభుత్వం ద్వారా ప్రజలకు చేరువయ్యామని, దీని ద్వారా ప్రజల ఆర్థిక పరిస్ధితులు, జీవన ప్రమాణాలు, గ్రామాల్లో మౌలిక సదుపాయాల సమస్యలను గుర్తించి వాటి మెరుగుకు కృషి చేశామన్నారు. అనంతరం మంత్రి బొత్స మాట్లాడుతూ రాష్ట్రంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పెద్దఎత్తున నిర్వహిస్తున్నామని, 45రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం పాటు ప్రతి గ్రామానికి వెళ్లి మళ్లీ ముఖ్యమంత్రిగా జగనే ఎందుకు కావాలన్న అవసరాన్ని వివరించాలని తెలిపారు. అలాగే ఈనెల 9న సిఎం జగన్‌ నిర్వహించే సమావేశానికి మండల, జిల్లా స్థాయి కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు హాజరవ్వాలని, రాబోయే రోజులలో నాయకులు పనితీరును మార్గనిర్ధేశం చేస్తారని అన్నారు.
ప్రజల్లో సానుభూతి పొందాలనే చంద్రబాబు ప్రయత్నాన్ని తిప్పికొట్టాలి
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అవినీతికి పాల్పడి జైలుపాలైన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రకరకాల కార్యక్రమాల ద్వారా ప్రజల్లో సానుభూతి పొందడానికి ప్రయత్నిస్తున్నారని, దీన్ని నాయకులు ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని అన్నారు. తాజా కేసులో 17(ఎ) నోటీసుపైనే మాట్లాడుతున్నారని, తప్పు చేయలేదని ఎందుకు చెప్పడం లేదని, ప్రజల దృష్టి మరల్చడానికి ఇంటింటా డప్పులు వాయించాలని సిగ్గులేకుండా పిలుపునిచ్చారని ఎద్దేవా చేశారు. ఆయన తప్పు చేయకపోతే ఆ విషయంపై తెదేపా ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన చర్చలో పాల్గొన కుండా ఎందుకు బాయికాట్‌ చేశారని ప్రశ్నించారు.
వైసిపి నాయకుల అందరి జాతకాలు జగన్‌ వద్ద ఉన్నాయి
అందరి నాయకులు జాతకాలు ముఖ్యమంత్రి జగన్‌ దగ్గర ఉన్నాయని, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినా, కార్యక్రమాల్లో వెనుకబడినా చర్యలు ఉంటాయని మంత్రి బొత్స సత్యనారాయణ తన ప్రసంగంలో కొంతమంది నాయకులను హెచ్చరించారు. తప్పుచేస్తే ఎంతటి వారయిన శిక్ష తప్పదని, ఫోక్స్‌వేగన్‌ కేసులో తనపైనా ఆరోపణలు వచ్చాయని, అయితే తాను దానిపై స్వచ్ఛంధంగా విచారణ కోరి, నిజాయితీ నిరూపించుకున్నానని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అలజంగి జోగారావు, విశ్వారాయి కళావతి, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌, టిడ్కో రాష్ట్ర చైర్మన్‌ జమ్మాన ప్రసన్నకుమార్‌, నియోజకవర్గ పార్టీ పరిశీలకులు శోభాహైమావతి, వాకాడ నాగేశ్వరరావు, నాలుగు నియోజకవర్గాల జెడ్‌పిటిసిలు, ఎంపిపిలు, ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.