ఓబులదేవర చెరువు : అధిక వడ్డీ ఆశచూపి ఓ ప్రయివేటు ఉపాధ్యాయుడు డ్వాక్రా మహిళలను మోసం చేశాడు. రూ.20 లక్షలు తీసుకుని వారికి అసలు కూడా ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో బాధితులు మంగళవారం నాడు పోలీసులను ఆశ్రయించి వారి గోడును వెల్లబోసుకున్నారు. బాధితులు తెలిపిన మేరకు ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... మండల పరిధిలోని కొండకమర్లకు చెందిన ప్రయివేటు ఉపాధ్యాయుడు గండికోటి చంద్ర అధిక డబ్బు చెల్లిస్తానని చంద్ర డ్వాక్రా మహిళలకు చెందిన రూ.20 లక్షలను 2011లో తీసుకున్నాడు. అప్పటి నుంచి ఒక్క రూపాయి కూడా వడ్డీ, అసలు ఇవ్వలేదు. పలుమార్లు మహిళలు డబ్బులు ఇవ్వాలని ఆయన్ను కోరినా స్పందన లేదు. ఇటీవల మహిళలు డబ్బు కోసం చంద్రను నిలదీస్తే తాను డబ్బులు ఇవ్వలేనని, ఐపి నోటీసులు పంపుతానని చెప్పాడు. కూలి పనులు చేసుకుని జీవనం సాగించే తమ డబ్బులను తీసుకుని మోసం చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని మహిళలు కోరారు. బాధితుల ఫిర్యాదు మేరకు దీనిపై విచారణ జరుపుతామని ఎస్‌ఐ గోపి తెలిపారు.










