ప్రజాశక్తి - భామిని : ప్రతి రైతు అధిక దిగుబడులు సాధించాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ పిలుపునిచ్చారు. సంకల్ప సప్తాV్‌ా కార్యక్రమంలో భాగంగా భామినిలో శుక్రవారం నిర్వహించిన కృషి మహౌత్సవంలో కలెక్టర్ పాల్గొన్నారు. కృషి మహౌత్సవంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ ప్రదర్శన శాలలను పరిశీలించారు. రైతులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆశావహ జిల్లాల్లో ఒక్కో మండలాన్ని ఒక బ్లాక్‌గా తీసుకుని అభివృద్ధి పథంలో నడిపించేందుకు అవకాశాలు కల్పించాలని సంకల్పించిందని చెప్పారు. పిఎం కిసాన్ - రైతు భరోసా కార్యక్రమం కింద ఏడాదికి రూ.13,500 ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని చెప్పారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనం నుంచి విక్రయం వరకు గల అవకాశాలను తెలియజేస్తున్నామన్నారు. సమీకృత వ్యవసాయ లాబ్‌లను ఏర్పాటు చేసి భూసారం తెలుసుకోవడం, దానికి అనుగుణంగా ఏ పంటలు వేయడం లాభదాయకం వంటి అంశాలను తెలుసుకోవాలని ఆయన అన్నారు. భూమిలో ఏ ధాతువు తక్కువగా ఉందో తెలుసుకుని దాన్ని ఉపయోగించాలని ఆయన పేర్కొన్నారు. కియాస్కో వినియోగం ఉపయోగకరం అన్నారు. కస్టమ్ హాయర్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఆధునిక వ్యవసాయ పనిముట్లు రైతుల ముంగిటకు తీసుకురావడం జరిగిందని చెప్పారు. తక్కువ అద్దెతో ఆధునిక వ్యవసాయ పనిముట్లు వినియోగించుకోవచ్చని తద్వారా తక్కువ పెట్టుబడితో వ్యవసాయ పనులు పూర్త వుతాయని అన్నారు. రైతులు అంతర పంటలు, తక్కువ సమయంలో దిగుబడి ఇచ్చే అపరాలు వేయాలని, పాడి పంటల్లో భాగంగా కోళ్లు, గొర్రెలు, మేకలు, ఆవులు, చేపలు పెంపకం చేపట్టాలని తద్వారా ఆదాయం వస్తుందని ఆయన సూచించారు. అంతర్జాతీయ చిరు ధాన్యాలు సంవత్సరం నిర్వహించడం జరుగుతుందని, సంప్రదాయ చిరు ధాన్యాలకు ప్రస్తుతం ప్రాధాన్యత ఉందని, వాటి సాగుపై దష్టి సారించాలని ఆయన పిలుపునిచ్చారు. రైతు కుటుంబాలు ఆర్థిక మనుగడ దిశగా దష్టి సారించాలని ఆయన పేర్కొన్నారు. పిల్లలకు బడిలో చేర్పించాలని, ఉన్నత విద్యను అందించాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి కల్పనా కుమారి, జిల్లా వ్యవసాయ అధికారి కె రాబర్ట్ పాల్, వ్యవసాయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.










