ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : జిల్లాలో అటవీ భూములతో పాటు వన్య ప్రాణాలను సంరక్షించాలని, అడవుల ఆక్రమణదారులపై వారంలోగా క్రిమినల్ కేసులు బనాయించాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో జిల్లాస్థాయి అటవీ వన్యప్రాణి సంరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొత్త జిల్లాలు ఏర్పడ్డాక జిల్లాలో అటవీ విస్తీర్ణం 28008.84 హెక్టార్లు ఉందన్నారు. జాతీయ అటవీ విధానం 1988 ప్రకారం 33 శాతం అటవీ విస్తీర్ణం కలిగి ఉండాల్సి వుండగా జిల్లాలో కేవలం 7.42 శాతం అటవీ భూమి మాత్రమే ఉందన్నారు. ఆ మేరకు 33 శాతం అటవీ భూమిని వద్ధి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. ఇందులో భాగంగా ఆక్రమణదారులపై ఉక్కు పాదం మోపి ఆక్రమణలు తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆక్రమ ణదారులు ఎంతటి వారైనా సరే విడిచి పెట్టవద్దని స్పష్టం చేశారు. ముఖ్యంగా మెట్లపల్లి బీట్ పరిధిలోని సురవరం, పోతురాజు గట్టు, నూతుల గట్టు, మెట్లపల్లి, మాలగట్టు, కాట్రేని పాడు, రిజర్వు అటవీ భూభాగంలోని 310.39 హెక్టార్ల లో ఆక్రమణలు జరిగినట్లు గుర్తించడం జరిగిందన్నారు. అలాగే కానూరు రిజర్వ్ ఫారెస్ట్ లో కూడా 635.77 హెక్టార్ల అటవీ భూమి చాలా వరకు ఆక్రమణకు గురైనట్లు గుర్తించడం జరిగిందన్నారు. ఈ అటవీ భూభాగాన్ని ఆక్రమించిన వారిపై వారం రోజుల్లోగా క్రిమినల్ కేసులు బనాయించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాటిని తిరిగి సంరక్షించు కొనుటకు అన్ని చర్యలు గట్టిగా చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో డిఎఫ్‌ఓ రాజశేఖర్, అదనపు ఎస్పీ శ్రీహరి రావు, డిఆర్‌ఓ ఎం.వెంకటేశ్వర్లు, డీఎఫ్‌ఓ కే రాజశేఖర్, ఆర్డిఓ ఐ కిషోర్, సర్వే భూ రికార్డుల ఏడి రంగారావు, మత్స్యశాఖ ఏడి వెంకటేశ్వర్ రెడ్డి, ఎఫ్‌ఆర్‌ఓ లు సిహెచ్ సుజాత, షరీఫ్, తహసిల్దార్ శ్రీవిద్య తదితర అధికారులు పాల్గొన్నారు.










