'అడ్వాన్స్' దోపిడీ
- సీటు కోసం నాన్ రీఫండబుల్ వసూలు
- సామాన్యులను దోచేస్తున్న కార్పొరేట్ కళాశాలలు
ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి
కార్పొరేట్ కళాశాలలు సామాన్యులను వివిధ రూపాల్లో దోచేస్తున్నాయి. సీటు రిజర్వ్ చేసుకోవడానికి అంటూ అడ్వాన్స్ పేరుతో నాన్ రీఫండబుల్ సొమ్మును వసూలు చేస్తున్నాయి. దీనిపై అధికారులు చర్యలు తీసుకోకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్వమవుతున్నాయి...
నిన్న మొన్నటి వరకూ ఫీజుల పేరుతో దోపిడీకి పాల్పడిన కార్పొరేట్ కళాశాలలు వసూలు కోసం మరో మార్గాన్ని ఎంచుకున్నాయి. సీటు బుక్ చేసుకోవడం కోసం విద్యార్థుల నుంచి డబ్బును వసూలు చేస్తున్నాయి. పదో తరగతి పూర్తయిన విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ఈ దోపిడీ సాగుతోంది. కార్పొరేట్ కళాశాలలు తమ కళాశాలలో అడ్మిషన్ చేయించేందుకు ప్రతి ఊరిలోనూ కొంత మందిని నియమించుకుంటారు. వారు విద్యార్థులను చేర్చించిన సంఖ్యను బట్టి కమిషన్ కూడా ఇస్తారు. పదో తరగతి పూర్తయిన కళాశాలలో చేరేందుకు ఎదురుచూస్తున్న విద్యార్థులను ఎరగా చేసుకుని కళాశాలలో సీటు కోసం బేరం కుదుర్చుకుంటారు. అన్నిటికంటే ముందుగా కళాశాలలో సీటు రిజర్వ్ చేయడానికి అడ్వాన్స్ మొత్తాన్ని కట్టాలని చెబుతారు. ఒక్కో విద్యార్థి నుంచి రూ5,500 అడ్వాన్స్‌గా వసూలు చేస్తారు. కార్పొరేట్ కళాశాలలో చదివించాలనే ఆశతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆ మొత్తాన్ని కట్టి సీటును రిజర్వ్ చేసుకుంటారు. అంతలో మంచి ప్రభుత్వ కళాశాలలోనో, రెసిడెన్షియల్ కళాశాలలోనో, తక్కువ బడ్జెట్‌లోనో ఉన్న కళాశాలలో సీటు దొరికితే విద్యార్థులు వాటిలో చేరిపోతారు. తాము కట్టిన అడ్వాన్స్ మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని సదరు కళాశాలను గానీ, డబ్బు కట్టించిన వారిని గానీ అడిగితే అది నాన్ రీఫండబుల్ మొత్తం అంటూ స్పష్టం చేస్తున్నారు. దాంతో వారు కార్పొరేట్ కళాశాలలో సీటు కోసం కట్టిన అడ్వాన్స్ మొత్తాన్ని నష్టపోతున్నారు.
మెటీరియల్ పేరుతోనూ దోపిడీ..
కార్పొరేట్ కళాశాలలు మెటీరియల్ పేరుతోనూ విద్యార్థులను నిట్టనిలువునా దోచేస్తున్నాయి. మెటీరియల్ రూ.12వేల నుంచి రూ.14వేల వరకూ కార్పొరేట్ కాలేజీలు వసూలు చేస్తున్నాయి. నీట్, ఐఐటిల పేరుతో ఈ మెటీరియల్‌ను అంటగడుతున్నారు. ప్రతి విద్యార్థి మెటీరియల్ తీసుకోవాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నారు. కార్పొరేట్ కళాశాలలు వివిధ పేర్లతో దోపిడీకి పాల్పడుతున్నా అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దోపిడీని అరికట్టాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో మునిగితేలుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.










