ప్రజాశక్తి - చిప్పగిరి
సొంత అన్నదమ్ముళ్లు, అతని భార్య ఇద్దరూ అనారోగ్యం బారినపడి మృతి చెందితే వారికి పుట్టిన బిడ్డను అక్కున చేర్చుకొని కంటికి రెప్పలా కాపాడాల్సిన పెదనాన్న, చిన్నాన్నలే ఆ బిడ్డకు చెందాల్సిన ఆస్తికి ఎసరు పెట్టారు. మాయ చేసి గుట్టుగా తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు కూడా..! ఇదేం అన్యాయమని ఆమె అడిగితే... 'మీ అమ్మానాన్నల వైద్య ఖర్చులకే డబ్బంతా ఖర్చయిపోయింది. ఇక ఆస్తిలో వాటా అంటూ ఏమీ లేదు. నీ దిక్కున్న చోట చెప్పుకో.. పో..!' అని దౌర్జన్యం చేస్తూ ఆమెకు అన్యాయం తలపెట్టారు. తనకు జరిగిన అన్యాయంపై ఆమె శక్తివంచన లేకుండా పోరాడారు. చివరకు రెవెన్యూ అధికారులు, పోలీసులు కూడా చేతులెత్తేయడంతో ఓపిక, సహనం నశించిన ఆమె తనకు ఇక ఆత్మహత్యే శరణ్యమని తన భర్త, చంటి పిల్లలతో కలిసి రోడ్డెక్కారు. ఈ సంఘటన గురువారం చిప్పగిరిలో చోటుచేసుకుంది.
చిప్పగిరి మండలం ఖాజీపురం గ్రామానికి చెందిన జంగం సన్నయ్య స్వామి, జంగం నాగమ్మ దంపతులకు... జంగం సోమన్న స్వామి, జంగం మురళీ స్వామి, జంగం రాఘవస్వామి కుమారులు. జంగం సన్నయ్యస్వామికి ఖాజీపురం గ్రామంలోని 22, 8/బి, 110/ఎ సర్వే నెంబర్లలో మొత్తం 24 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. సన్నయ్యస్వామి కుమారులకు వివాహాలై వారికీ పిల్లలు ఉన్నారు. జంగం సన్నయ్యస్వామి దంపతుల రెండో సంతానం జంగం మురళీ స్వామి, అతని భార్య ఇద్దరూ అనారోగ్యం బారినపడి 2003లో మృతి చెందారు. ఈ దంపతులకు సౌమ్య, విద్య కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె సౌమ్య కూడా అనారోగ్యంతో మృతి చెందారు. చిన్న కుమార్తె విద్య మాత్రమే ఉన్నారు. సొంత అన్న, దమ్ముడికి మిగిలిన ఏకైక సంతానం విద్యను తమ పిల్లలతో పాటే పెంచి ఆమె ఆలనపాలన చూడాల్సిన అన్నదమ్ములు ఇద్దరు ఆ బాధ్యతను విస్మరించడంతో విద్యకు మేనమామే కన్న తండ్రి అయ్యారు. తల్లిదండ్రులు ఇద్దరూ మరణించడం, పెద్దనాన్న, చిన్నాన్నల ఆదరణకు దూరమైన విద్య మంత్రాలయంలోని తన మేనమామ వద్ద పెరిగారు. అక్కడే పెళ్లి చేసుకొని తన భర్త, ఇద్దరు పిల్లలతో ఉంటున్నారు. ఇదే అదనుగా భావించిన సోమన్న స్వామి, జంగం రాఘవస్వామి ఇద్దరూ తమ తండ్రి జంగం సన్నయ్యస్వామికి చెందిన 24 ఎకరాల వ్యవసాయ భూమిలో జంగం మురళీ స్వామి వారసురాలు విద్యకు వాటా ఇవ్వకుండా, కాజేసి గుట్టుగా 2021లో తమ పేరిట రిజిస్టర్ చేయించుకున్నారు. విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న విద్య తండ్రి ద్వారా తనకు చెందాల్సిన 8 ఎకరాల భూమి కోసం న్యాయ పోరాటం మొదలెట్టారు. అప్పటికే జంగం సోమన్నస్వామి, జంగం రాఘవస్వామి 24 ఎకరాల వ్యవసాయ భూమిని తమ పేరిట, తమ భార్యల పేరిట రిజిస్టర్ చేయించారు. రైల్వే శాఖలో ఆర్‌పిఎఫ్‌గా పనిచేస్తున్న సోమన్న స్వామి రెండో భార్య అయిన గంగమ్మ ఆస్తిలో వాటా ఇచ్చేది లేదని, తన కొడుకుతో కలిసి తరచూ బెదిరించేదని విద్య చెబుతున్నారు. తహశీల్దార్, ఆర్‌డిఒ కలెక్టర్, ఎస్‌ఐ, సిఐ, డీఎస్పీ, ఎస్పీ, ఇలా అన్ని స్థాయిల రెవెన్యూ, పోలీసు అధికారుల చుట్టూ తిరిగి న్యాయం చేయాలని మొరపెట్టుకోని రోజంటూ లేదు. ఎప్పుడో పెద్దల సమక్షంలో కూడా దుప్పటి పంచాయితీ జరిగింది. అక్కడ పెద్ద మనుషులు వ్యవసాయ భూమిలో వాటా కాకుండా రూ.8 లక్షల నగదును సోమన్న స్వామి, రాఘవ స్వామి ఇద్దరూ కలిసి విద్యకు ఇచ్చేలా, అందుకు కొంత గడువు నిర్ణయించి రాజీ కుదిర్చారు. నిర్ణీత గడువులోపు రూ.8 లక్షల నగదు ఇవ్వలేదు. కథ మళ్లీ మొదటికొచ్చింది. ఎవరు చూసినా ఇది సివిల్‌కు సంబంధించిన సమస్య, పెద్దల సమక్షంలో పరిష్కరించుకోవాలని, లేదా కోర్టును ఆశ్రయించాలని సలహా ఇస్తున్నారే తప్ప విద్యకు న్యాయం చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. విసిగి వేసారిన విద్య మంత్రాలయం నుంచి తన భర్త, పిల్లలను తీసుకొని గురువారం చిప్పగిరికి చేరుకొని అంబేద్కర్ సర్కిల్‌లో బైఠాయించి నిరసన దీక్ష చేపట్టారు. విషయం తెలిసి స్థానిక పోలీసులు ఆమెకు నచ్చజెప్పి తహశీల్దార్ లక్ష్మీనారాయణ వద్దకు తీసుకెళ్లారు. తహశీల్దార్ కూడా ఆమెకు సర్ది చెప్పి విద్య తాతయ్య సన్నయ్య స్వామికి చెందిన వ్యవసాయ భూమి వివరాలు, ప్రస్తుతం ఆమె పెద్దనాన్న, చిన్నాన్నలు అనుభవిస్తున్న వ్యవహారం మొత్తం రెండు వారాల్లోపు నివేదిక రూపంలో ఆర్‌డిఒకు సమర్పిస్తానని హామీ ఇచ్చారు. అప్పటివరకు ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడవద్దని విద్యను కోరారు. ఇంతకాలమే ఎదురుచూశానని, మరో రెండు వారాలు వేచి చూస్తానని చెప్పి తన నిరసనను విరమించి భర్త, పిల్లలతో కలిసి మేనమామ వెంట రాగా మంత్రాలయానికి వెళ్లారు. రెండు వారాల గడువు కోరిన తహశీల్దార్ లక్ష్మీనారాయణ ఆర్‌ఒఆర్ చట్టం ప్రకారం వివాదానికి దారి తీసిన సన్నయ్యస్వామి భూమి వ్యవహారానికి సంబంధించిన నివేదికను ఆర్‌డిఒ కార్యాలయానికి అప్పగిస్తానని చెప్పారు. తర్వాత ఆర్‌డిఒ స్థాయిలో విద్యకు ఎలాంటి న్యాయం జరుగుతుందో వేచి చూడాలి.
విద్యతో మాట్లాడుతున్న పోలీసులు










