Aug 26,2023 21:18

రాంజల చెరువు

ప్రజాశక్తి - ఆదోని
ఆదోని పట్టణ ప్రజల దాహార్తి తీర్చే బసాపురం సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకు కుంగిపోయింది. చెరువు మరమ్మతులు చేపట్టాలన్నా నెలల తరబడి సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. తుంగభద్ర దిగువ కాలువ నీటి ప్రవాహం తగ్గకముందే ట్యాంకును నీటితో నింపుకోవాల్సి ఉంది. ప్రస్తుతం ట్యాంకు నీటితో నిండాలంటే 40 రోజుల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. స్టోరేజ్‌ ట్యాంకు వాలు కుంగిపోవడంతో నీటి పంపింగ్‌ ఆపేశారు. ప్రస్తుతం కాలువ నుంచే మోటార్ల ద్వారా నీటిని ఓవర్‌హెడ్‌ ట్యాంకుకు పంపింగ్‌ చేస్తున్నారు. విద్యుత్‌ అంతరాయం, సాంకేతిక కారణాలు ఏర్పడితే నీటి నిల్వ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువు మరమ్మతులు రెండు దఫాలు చేసినప్పటికీ గోడ నిల్వలేక కుంగిపోయింది. సిమెంట్‌ లైనింగ్‌ పనులు నాణ్యత లోపం వల్లనే ఇలా జరిగిందని పలువురు పేర్కొంటున్నారు. మరమ్మతులు పూర్తయ్యలోపు కాలువలో నీటి ప్రవాహం తగ్గిపోతే పట్టణ ప్రజల దాహార్తిని తీర్చడం తలకు మించిన భారమని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఆదుకోనున్న రాంజల చెరువు
రాజుల కాలం నాటి రాంజల చెరువు ప్రస్తుతం ఆదోని ప్రజలను ఆదుకోనుంది. నీటిని నిల్వ చేసి అక్కడి నుంచి పట్టణవాసులకు సరఫరా చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుతం రాంజల చెరువులో నిల్వ ఉన్న నీటిని సరఫరా చేయరాదని, తాగడానికి పనికి రావని గతంలో సాంకేతికంగా, శాస్త్రీయంగా నిరూపణ అయింది. ఆ నీటిని తాగడం వల్ల డయేరియా వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు గతంలో తెలిపారు.
నీటిని బయటకు పంపే కార్యక్రమం షురు
ప్రస్తుతం రాంజల చెరువులో ఉన్న నీటిని బయటకు పంపేందుకు అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. చెరువును అన్ని విధాలుగా శుభ్రం చేసి అక్కడ ఉన్న ఫిల్టర్‌ బెడ్‌లను శుభ్రం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్‌ 1 నుంచి ఎల్‌ఎల్‌సి నుంచి నీటి తోడేందుకు చర్యలు ముమ్మరం చేశారు.
1 నుంచి చెరువుకు నీటి పంపింగ్‌
- రఘునాథ్‌ రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌

రాంజల చెరువును అన్ని విధాలుగా శుభ్రం చేసే పనులు మొదలయ్యాయి. సెప్టెంబర్‌ 1 నుంచి ఎల్‌ఎల్‌సి కాలువ నుంచి నీటిని చెరువుకు పంపింగ్‌ చేసేందుకు చర్యలు ముమ్మరం చేశాం. అక్కడి నుంచి పట్టణ ప్రజలకు నీటి సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. తాగునీటి ఎద్దడి తప్పే అవకాశం ఉంది. ప్రజలు సహకరించాలి.