Oct 20,2023 20:35

వివరాలు సేకరిస్తున్న పోలీసులు

ప్రజాశక్తి మంత్రాలయం
అదృశ్యమైన వ్యక్తుల వివరాలను సేకరించే పనిలో ప్రకాశం జిల్లా పోలీసులు పడ్డారు. శుక్రవారం స్థానిక శ్రీమఠం నిర్వహణలో ఉన్న వివిధ వసతి గృహాల విచారణ కార్యాలయాల్లో, ప్రయివేట్‌ లాడ్జీల్లో మార్కాపురం ఎఎస్‌ఐ షేక్‌ మునాఫ్‌ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2018-23 మధ్య ప్రకాశం జిల్లాలో సుమారు 120 మంది అదృశ్యమైనట్లు కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇందులో అమ్మాయిలు, అబ్బాయిలు, పెళ్లి కాని యువతులు, యువకులు, మహిళలు, వృద్ధులు ఉన్నారని చెప్పారు. జిల్లా ఎస్పీ మల్లికా గగ్గ, అడిషనల్‌ ఎస్పీ శ్రీధర్‌ బాబు ఆదేశాల మేరకు జిల్లాలోని ఒంగోలు, దర్శి, మార్కాపురం, కనిగిరి డివిజన్ల నుంచి నాలుగు బృందాలుగా ఏర్పడి అదృశ్యమైన వ్యక్తుల వివరాలను, ఫొటోలను చూపిస్తూ ఆరా తీస్తున్నామని తెలిపారు. అదృశ్యమైన వ్యక్తుల వివరాల తెలిసిన వారు 8074526525 ఫోన్‌ నెంబర్‌కు కాల్‌ చేయాలని కోరారు. ఆయన వెంట పోలీసు సురేష్‌ ఉన్నారు.