శతజయంతి సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు మంతెన సీతారాం
ప్రజాశక్తి - ఏలూరు
సిపిఎం పూర్వపు రాష్ట్రకార్యదర్శి, కార్మిక, కర్షకనేత కొరటాల సత్యనారాయణ జీవితం అందరికీ ఆదర్శమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు మంతెన సీతారాం అన్నారు. ఆదివారం స్థానిక ఉద్దరాజురామం భవనం (సిపిఎంకార్యాలయం)లో జరిగిన కొరటాల సత్యనారాయణ శతజయంతి సభ సిపిఎం జిల్లా కార్యదర్శి రవి అధ్యక్షతన జరిగింది. ఈ సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీతారాం మాట్లాడారు. ముందుగా కొరటాల చిత్రపటానికి పూలమాలవేసి జోహార్లు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొరటాల రెండుసార్లు ఎంఎల్‌ఎగా, సిపిఎం రాష్ట్రకార్యదర్శిగా, పోలిట్ బ్యూరో సభ్యునిగా పలు ఉన్నత బాధ్యతలు నిర్వహించినా సాధారణ వ్యక్తిలా కార్యకర్తలతో, ప్రజలతో సైతం కలిసిపోయేవారన్నారు. చేనేత కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికుల సమస్యలపై లోతైన అధ్యయనం సాగించి వారి సమస్యలపై పోరాటాలకు నాయకత్వం వహించిన నేత అని అన్నారు. రాజకీయాలు వ్యాపారంగా మార్చిన ఈ తరుణంలో సమాజ మార్పునకు చేసి కృషి నేటితరం కార్యకర్తలకు ఆదర్శనీయమన్నారు. ఒకప్రక్క మతోన్మాదం, మరోపక్క ప్రజాస్వామ్యాన్ని కాలరాసి నిరంకుశత్వంతో వ్యవహరించే థోరణి పెచ్చరిల్లుతోందన్నారు. సామాన్యుల సమస్యలు, జీవితాలను గాలికొదిలి, రాజకీయాల్లో రూ.కోట్లకు పడగలెత్తే థోరణలు రాజ్యమేలుతున్నాయన్నారు కొద్దిపాటి పథకాలతో ఊరించి ప్రజలను భ్రమల్లో ఉంచేందుకు అధికార, ప్రతిపక్షపార్టీలు పోటీపడుతున్నాయన్నారు. ఈ తరుణంలో ప్రజా జీవితాల్లో సమూలమైన మార్పు కోసం కొరటాల చూపిన బాటలో మనమందరం సాగాలని సీతారాం పిలుపునిచ్చారు. జిల్లా ఏజెన్సీ ప్రాంత భూఉద్యమాన్ని సాగించడంలో కొరటాల నిరంతరం అనేక విలువైన సూచనలు, సలహాలు ఇచ్చారన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి మాట్లాడుతూ కొరటాల సామాన్యులను, యువతను సైతం అక్కున చేర్చుకుని ఆప్యాయంగా మాట్లాడే వారిని, తద్వారా అందరి మనసులను గెలుచుకున్నారన్నారు. యువతను వారి సమస్యలు మనోభావాలను అర్థం చేసుకుని వారిని నడిపించేందుకు విశేషకృషి సాగించారన్నారు. ఈ సభలో డిఎన్‌వి.ప్రసాద్, పి.కిషోర్ మాట్లాడారు. ఈ సభలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బి.సోమయ్య, జిల్లా నలుమూలల నుండి సిపిఎం కార్యకర్తలు హాజరయ్యారు.










